నకిరేకల్, ఆగస్టు 22 : పోతిరెడ్డిపాడు ద్వారా నాగార్జునసాగర్‌ను నింపి ఎడమ కాలువ ద్వారా జిల్లా రైతాంగానికి నీళ్లు వదలాలని, లేనిపక్షంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీఎత్తున ఆందోళన చేస్తామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య హెచ్చరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని పెద్ద చెరువును శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వంలో నాగార్జునసాగర్‌లో 510 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ ఎడమ కాలువ ద్వారా నల్లగొండ జిల్లా రైతులకు రెండు పంటలకు నీరందించిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రస్తుతం సాగర్‌లో 532 అడుగుల నీటిమట్టం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎందుకు నీరు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు నల్లగొండ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సాగు, తాగునీటి సరఫరాపై తీవ్రనిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. రైతుల అరిగోస, ఆక్రందన ఇరిగేషన్ మంత్రి చెవులకు వినిపిస్తలేదా? అని ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి పుష్కలంగా నీరు వస్తున్నా సాగర్‌ను ఎందుకు నింపడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ఆంధ్రాకు నీళ్లు తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.