హాలియా, ఆగస్టు 22 : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఆయకట్టు బీడు బారింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతున్నా.. సాగర్ జలాశయంలో ప్రస్తుతం 527.20 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయడం లేదు. ఎగువ నుంచి సాగర్ జలాశయానికి వరద నీరు వస్తున్నా ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు భగ్గుమంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగర్ జలాశయంలో 510 అడుగుల కన్నా తక్కు నీటిమట్టం ఉన్నా సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 527.20 అడుగుల మేర నీరు ఉన్నా, ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయకపోవడంతో 11.24 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం బీడువారింది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడం, జలాశయంలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోలేకపోవడంతో ఎడమ కాల్వ కింద గల ఆయకట్టు ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీలో ఉన్నప్పుడే 510 అడుగుల కన్నా నీటిమట్టం తక్కువగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వ రైతులకు సాగునీరు ఇవ్వగలిగినప్పుడు ప్రస్తుత ప్రభుత్వం 526 అడుగుల మేర ఉన్నప్పటికీ ఎందుకు ఇవ్వలేకపోతోందని ప్రశ్నిస్తున్నారు.
సాగర్ ఎడమ కాల్వ ద్వారా యేటా 11,24,500 ఎకరాలకు సాగు నీరందుతుంది. అందులో రాష్ట్రంలోని 6 లక్షల 84 వేల ఎకరాలకు సాగునీరు అందుతుండగా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు 4,04,760 ఎకరాల సాగునీరు అందుతుంది. తెలంగాణలోని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,72,970 ఎకరాలకు సాగునీరు అందుతుండగా ఖమ్మం జిల్లాలోని 3,46,769 ఎకరాలకు సాగునీరు అందుతుంది. గతేడాది సాగర్ నియోజకవర్గంలో రైతులు ఎడమ కాల్వ కింద లక్షా 20 వేల ఎకరాల్లో సాగు చేస్తే ఇప్పుడు బోరుబావుల కింద కేవలం వెయ్యి ఎకరాల్లో మినహా ఎక్కడా వరి సేద్యం చేస్తున్న దాఖలాలు లేవు. ప్రభుత్వం ఎడమ కాల్వకు సాగునీటిని విడుదల చేయకపోగా, సేద్యానికి కూడా రోజుకు 12 గంటల పాటు కూడా సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. గతంలో పచ్చని పోలాలతో కళకళలాడిన ఆయకట్టు ఇప్పుడు బీడు భూమిని తలపిస్తోంది.

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షపాతం నమోదు తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎడమ కాల్వ కింద ఉన్న రైతులకు ఆరుతడి పంటల సాగుపై సన్నద్ధం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. రైతులు నాట్లు వేసే సమయంలో వ్యవసాయశాఖ అధికారులు వచ్చి ప్లీజ్ దండం పెడుతున్నాం.. వరి వేయొద్దంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడాన్ని రైతులు, బీఆర్ఎస్ నాయకులు తప్పుపడుతున్నారు.
నాగార్జున సాగర్ జలాశయం నుంచి వరుసగా 17 సార్లు రెండు పంటలకు సాగునీరు ఇచ్చిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. సాగు నీటిని సద్వినియోగం చేసుకోవడంలోనూ, నీటిని పొదుపుగా వాడడంలోనూ కేసీఆర్ ప్రభుత్వం సఫలం కాగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో జలాశయాలన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. వానకాలం సీజన్ రావడంతో రైతులు సాగు కోసం నారుమళ్లు సిద్ధం చేసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్నీ కష్టాలే. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఎడమ కాల్వకు సాగునీరు ఇవ్వకపోగా వ్యవసాయానికి 12 గంటల కరెంటు కూడా సక్రమంగా సరఫరా చేయలేకపోతున్నది. రైతులకు రెండు లక్షల రుణ మాఫీ చేయకపోగా, రైతుబంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. నిన్నటి వరకు యూరియా కష్టాలు.. ఇప్పుడు నీటి కష్టాలు.. అలాగే ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులకు తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వానికి ముందు చూపు లేదు.
శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. జూలైలో సాగర్ జలాశయ నీటిమట్టం 513 అడుగులు ఉండగా ప్రస్తుత నీటిమట్టం 527.20 అడుగులకు చేరింది. అయినప్పటికీ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసే విషయంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఎడమ కాల్వ కింద ఉన్న ఆయకట్టు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల కృష్ణానది పరీవాహక ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్నాటక రాష్ర్టాల్లో వర్షాలు విస్తారంగా కురియడంతో ఆల్మట్టి మొదలు శ్రీశైలం వరకు ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీశైలంలో జల విద్యుత్ చేపట్టడంతో శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి వరదనీరు వచ్చి చేరుతోంది. సాగర్ జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి రోజుకు 40 నుంచి 50 వేల క్యూసెక్కుల మేర వరదనీరు వస్తుండటంతో సాగర్ జలాశయ నీటిమట్టం రోజుకు అడుగు నుంచి రెండు అడుగుల మేర పెరుగుతోంది. సాగర్ జలాశయ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు (312-0450 టీఎంసీలు) కాగా ప్రస్తుతం సాగర్ జలాశయంలో 527.20 అడుగులు (167.9514 టీఎంసీలు) నీరు ఉంది. సాగర్ ఎడమ కాల్వ కింద యేటా 11.24 లక్షల ఎకరాల వరి సాగవుతోంది. అందుకుగాను కారుకు 30 నుంచి 35 టీఎంసీల నీరు అవసరం.