Akshara Hassan | సినీ కుటుంబంలో పుట్టిన వారికి అవకాశాలు సులభంగానే వస్తాయని చాలామంది భావిస్తుంటారు. అయితే ప్రతి స్టార్ కిడ్ ప్రయాణం ఒకేలా ఉండదని నటి అక్షర హాసన్ చెబుతున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్, నటి సారికల చిన్న కుమార్తె, నటి శ్రుతి హాసన్ సోదరి అయిన అక్షర.. తన వ్యక్తిగత జీవితం, చదువు, సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను తాజాగా సైరస్ బ్రూచా పాడ్కాస్ట్లో వెల్లడించారు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తాను నేరుగా నటిగా కెరీర్ ప్రారంభించలేదని అక్షర తెలిపారు. మొదట స్నేహితుల మ్యూజిక్ వీడియోలకు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసినట్లు చెప్పారు. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశానని వెల్లడించారు.
తన అసలు లక్ష్యం మాత్రం దర్శకత్వమేనని అక్షర స్పష్టం చేశారు. నటనలోకి అడుగుపెట్టడం కూడా ఒక ప్రయత్నంలో భాగమేనని చెప్పారు. నటిగా తనను తాను నిరూపించుకున్నప్పటికీ భవిష్యత్తులో కచ్చితంగా మెగాఫోన్ పట్టి సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. తన విద్యాభ్యాసం గురించి కూడా అక్షర ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడారు. హైస్కూల్ చదువులో తాను పెద్దగా రాణించలేకపోయానని చెప్పారు. 10వ తరగతి పరీక్షల్లో వరుసగా మూడుసార్లు విఫలమైనట్లు వెల్లడించారు. మూడుసార్లు ఫెయిల్ అయిన తర్వాత ఇక చదువుపై ఆసక్తి తగ్గిపోయిందని, పాస్ కావడం తనకు కష్టంగా అనిపించడంతో చదువును మధ్యలోనే ఆపేశానని అక్షర తెలిపారు. అయితే చదువులో ఎదురైన వైఫల్యాలు తన జీవితాన్ని ఆపలేదని, తనకు ఆసక్తి ఉన్న కళలు, సినిమాపై దృష్టి పెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు.
కమల్ హాసన్, సారికల కుమార్తె కావడంతో తాము తప్పనిసరిగా నటనలోనే కొనసాగాలనే ఒత్తిడి ఇంట్లో ఎప్పుడూ లేదని అక్షర వెల్లడించారు. తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇచ్చారని చెప్పారు. నటన ఇష్టం లేకపోతే మరో రంగంలో స్థిరపడమని తల్లిదండ్రులు చెప్పేవారని, తమకు నచ్చిన పని చేసుకోవచ్చని ప్రోత్సహించారని తెలిపారు. ఈ స్వేచ్ఛ తమపై ఉన్న ఒత్తిడిని చాలా వరకు తగ్గించిందని అక్షర పేర్కొన్నారు. తమ కుటుంబంలో సినిమాలకు సంబంధించిన విషయాలను చాలా సీరియస్గా చర్చిస్తామని అక్షర చెప్పారు. తాను నటించిన సన్నివేశాలు నచ్చకపోతే కుటుంబ సభ్యులు మొహమాటం లేకుండా చెబుతారని వెల్లడించారు. తప్పులు చేస్తే వాటిని తామే గుర్తించి నేర్చుకునేలా వదిలేస్తారని తెలిపారు.