భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22 : యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెం గ్రామం శివారులోని హెజోలో లేబోరేటరీస్ కెమికల్ కంపెనీలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా మారింది. హేజోలో కంపెనీలో సిబ్లాక్ లో నైట్ షిఫ్ట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. కంపెనీలో పని చేస్తుండగా రియాక్టర్ భారీ శబ్దంతో పేలి పోవడంతో మంటలు క్షణాల్లో వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులు తీశారు. పేలుడులో నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చిన్నగూడెం చెందిన చెన్ను నాగిరెడ్డి(31), ఖమ్మం జిల్లా మెయిన్ రోడ్ డారానికి చెందిన నాగనబోయిన నరేశ్‌కుమార్(29) మృతి చెందారు. వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. రియాక్టర్ వద్ద పని చేస్తున్న పదిమంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్‌కు తరలించారు. రియాక్టర్ భారీ శబ్దంతో పేలడంతో కార్మికులు, పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ రూరల్ సీఐ సతీశ్‌రెడ్డి, ఎస్ఐ జగన్ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చౌటుప్పల్ హయత్ నగర్ నుంచి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను ఆర్పాయి. గత జూలై 16న రసాయన విష వాయువులు పీల్చడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా సింగనమల మండలం ఉలికల్లుకు చెందిన కార్మికుడు ఆలుమూరు కృష్ణారెడ్డి(42) మృతి చెందాడు. ప్రమాదం జరిగి నెల రోజులు కాకముందే రియాక్టర్ పేలడం భద్రత వైఫల్యానికి నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం, భద్రతా ప్రమాణాలు లోపించడంతో కంపెనీల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రియాక్టర్ భారీ శబ్దంతో పరిసర గ్రామాల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రోడ్డు పైకి పరుగులు తీశారు. వరుస ప్రమాదాలు జరగడంతో గ్రామంలో భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి నుంచి పోలీసులు కంపెనీలో భారీ బందో బస్తు నిర్వహిస్తున్నారు.

మృతుల కుటుంబాలకు రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ శనివారం హెజోలో కెమికల్ కంపెనీ ఎదుట రాజకీయ నాయకులు, గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. మృతుల ఒకో కార్మిక కుటుంబానికి రూ.5 కోట్ల ఎక్స్‌గ్రేషియా, మృతి చెందిన కార్మిక కుటుంబాలకు ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం, కంపెనీ యజమానుల భద్రతా లోపంతో కార్మికుల ప్రాణాలను బలిగొంటున్నారని, అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. జిల్లా కలెక్టర్, పీసీబీ అధికారులు, కంపెనీ యజమాన్యం వచ్చే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. కంపెనీ ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కంపెనీలోకి వెళ్లేందుకు గ్రామస్తులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. గ్రామస్తులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది . దోతిగూడెం నుంచి పరిశ్రమలను తరలించే దాకా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆర్డీవో శేఖర్‌రెడ్డి , డీఎస్పీ మధుసూదన్‌రెడ్డి, పీసీబీ ఈఈ వెంకన్న, లేబర్ ఆఫీసర్ ఈ చంద్రశేఖర్, ఇండస్ట్రియల్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, తాసీల్దార్ శ్రీనివాసరెడ్డి, సీఐలు మన్మథరావు, శ్రీకాంత్‌రెడ్డి, ఎస్ఐ జగన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 22: రియాక్టర్లను పూర్తిగా మరమ్మతు చేసే వరకు హెజోలో లాబరేటరీస్ కంపెనీని సీజ్ చేస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాసరరావు ప్రకటించారు. శనివారం భూదాన్ పోచంపల్లి మండలం ధోతి గూడెం గ్రామం హెజోలో పరిశ్రమలో జరిగిన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అన్ని విషయాలపై ఆరా తీశారు. మృతుల ఒక్కో కుటుంబానికి రూ.1.80 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కంపెనీ యజమాన్యానికి ఆయన సూచించారు . నైట్ షిఫ్ట్‌లో రాత్రి 10 నుంచి 10.30 గంటల లోపు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని , దీనిపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రులు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు వైద్యుల ఖర్చుల బాధ్యత కంపెనీ యజమాని భరించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ యాట జంగయ్య, ఉప సర్పంచ్ బద్దం వెంకటరెడ్డి, నాయకులు ఉటూరి అశోక్, ఏలే చంద్రశేఖర్, పగిళ్ల రామ్‌రెడ్డి, ముద్దం సత్యం, కల్లూరి మల్లేశం, కోమటిరెడ్డి చంద్రారెడ్డి, కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు, మంచాల మధు తదితరులు పాల్గొన్నారు.