DaisyEdgarJones | దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రంలో బ్రిటీష్ నటి డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఈ హాలీవుడ్ బ్యూటీ కనిపించనుందని, వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్ర కోసం ఈ అమ్మడిని అనుకున్నప్పటికీ డేట్స్ సర్దుబాటు కాక తప్పుకున్న విషయం తెలిసిందే. ఒకవేళ ఈ వార్త నిజమైతే, రాజమౌళి దర్శకత్వంలో నటించే అవకాశం డైసీకి మరోసారి దక్కినట్టే అవుతుంది.