గుండాల, ఆగస్టు 22 : గుండాల మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నిక రాజకీయ రంగు పులుముకుని రోజుకో మలుపు తిరుగుతోంది. మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవికి ఇటీవలే గడువు ముగియడంతో ఆగస్టు 19న గుండాల స్త్రీశక్తి భవనంలో ఎన్నికల పరిశీలకులు డీపీఎం(ఐబీ) ప్రభాకర్, డీపీఎం (నాన్ ఫామ్) రవీందర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవి కోసం అంబాల గ్రామ వీవో బీసు మానస, ఇది వరకు మండల, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలిగా కొనసాగిన నూనెగూడెం వీవో కందుకూరి రేణుక పోటీ పడ్డారు. గుండాల మండలంలోని 20 గ్రామాల్లో ఆరు ఈసీ మెంబర్లు ఉండగా.. అందులో ఆరుగురు ఈసీ మెంబర్లు మండల సమాఖ్య అధ్యక్షురాలి ఎన్నికకు ఓటు వేస్తారు. బీసు మానసకు తన ఓటుతో పాటు 4 ఓట్లు పొంది మొత్తం 5 ఓట్లు సాధించారు. కందుకూరి రేణుక తన ఓటును మాత్రమే పొందారు.
దీంతో ఎన్నికల పరిశీలకులు బీసు మానసను మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ప్రకటించారు. నూతనంగా మండల సమాఖ్య అధ్యక్షురాలు బీసు మానస ఎన్నిక సమభావన సంఘాల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందంటూ ప్రజాప్రతినిధుల భార్యలు మండల సమాఖ్య అధ్యక్షురాలిగా ఉండకూడని చట్టంలో ఉందంటూ అంబాల వీవోతో పాటు మండల సమాఖ్యకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలని, గతంలో మండల సమాఖ్య అధ్యక్షురాలిగా పని చేసిన కందుకూరి రేణుక డీఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు లోబడి అంబాల వీవోతో పాటు మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవికి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డీఆర్డీవో నాగిరెడ్డి గుండాల ఏపీఎం వెంకటేశ్వర్లుకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవికి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడే అసలు విషయం ఉంది.
మండల సమాఖ్య అధ్యక్షురాలి పదవిలో కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా ఉండే వారినే నియమించుకోవాలన్న రాజకీయ ఒరవడిని సృష్టించేందుకు కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైన బీసు మానస భర్త బీసు ప్రశాంత్ బీఆర్ఎస్ కార్యకర్త అనే కారణంతోనే తిరిగి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులపై కాంగ్రెస్ నాయకులు రాజకీయ ఒత్తిడి చేస్తున్నారని పలువురు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులపై ఒత్తిడి పెంచేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రభుత్వ విప్ల సహకారంతో కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు సూచించిన అభ్యర్థికి సహకరించని వీవోలను 60 సంవత్సరాల నిబంధనల పేరిట తొలగించే కుట్ర చేస్తున్నారని, అదే కనుక జరిగితే కాంగ్రెస్లో క్రియాశీలకంగా పని చేసిన మాజీ మహిళా ప్రజాప్రతినిధితో పాటు పలువురు వీవోల కుటుంబాల్లోని కాంగ్రెస్ నాయకులు ఆ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
మండల సమాఖ్య ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని అధ్యక్షురాలిగా ఎన్నుకోవడానికి ఇద్దరు ప్రభుత్వ విప్ల ప్రమేయం ఉండ టం హాస్యాస్ఫదమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎండీ ఖలీల్ ఆరోపించారు. ఇటీవల ఎన్నికైన బీసు మానసను అధ్యక్షురాలి ప దవి నుంచి తప్పించే కుట్ర జరుగుతోందన్నారు. బీసు మానస కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ నేపథ్యం ఉందన్న అక్కసుతోనే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని మండల సమాఖ్య అధ్యక్షురాలిగా చేయాలనే కుట్ర చేస్తున్నారని అన్నారు.