‘కలెక్టర్లు, అధికారులు చేసిన తప్పిదంతో మూడు లక్షల ఎకరాల నిషేధిత భూమి 30 లక్షలకు పెరిగింది. ఇప్పుడు వీటిని తీస్తే ఒక బాధ.. తీయకపోతే మరో బాధలా ఉన్నది. నేనేం చేయాలి అధ్యక్షా.. ముందు నుయ్యి, వెనుక గొయ్య మాదిరిగా ఉన్నది. చావాల్నా ఏంది’
– అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): నిషేధిత జాబితాపై ప్రభుత్వం బండారం అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైంది. గతంలో 3.73 లక్షల ఎకరాలు మాత్రమే నిషేధిత జాబితాలో ఉండగా, తమ ప్రభుత్వం ఏకంగా 30 లక్షల ఎకరాలను అందులో చేర్చిందని సీఎం రేవంత్‌రెడ్డి శాసనసభ సాక్షిగా అంగీకరించారు. అసెంబ్లీలో బుధవారం 22ఏ భూముల అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు వివరాలను వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు, అధికారుల తప్పిదాల వల్లే నిషేధిత భూముల జాబితా పెరిగిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భూములను నిషేధం నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాము 12 అంశాలను గుర్తించామని, వాటికి విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.
30 లక్షల ఎకరాలకు
2020 అక్టోబర్ నాటికి ప్రైవేట్ వ్యక్తులకు చెందిన 7.91 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉండేదని సీఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వం దానిని 3.73 లక్షల ఎకరాలకు తగ్గించిందని చెప్పారు. ఇప్పుడు అధికారుల తప్పిదంతో ఇది 30 లక్షల ఎకరాలకు పెరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం విక్రయించిన భూములు, ప్రభుత్వం చేసిన లేఅవుట్స్, సీలింగ్ క్ల్లియర్ అయిన భూములు ఇలా అన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లాయని తెలిపారు. అసైన్డ్, అటవీ, ప్రభుత్వ, శిఖం, దేవాదాయ, యూఎల్సీ, కోర్టు కేసులు, ఈడీ అటాచ్మెంట్లు ఇలా మొత్తంగా 98.31 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలో ఉందని, ఇందులో నుంచి ఒక్క ఎకరం కూడా తీసే అవకాశం లేదని అన్నారు.
1999 జాబితాను అప్లోడ్ చేశారు
22ఏ నిషేధిత జాబితా పిడుగును అధికారులపై, కోర్టులపై నెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నించారు. నిషేధిత భూముల జాబితాను 2025 అక్టోబర్ 27నాటికి సబ్రిజిస్ట్రార్లకు అందించాలని హైకోర్టు ఆదేశించిందని, ఆ మేరకు అధికారులు హడావిడిగా జాబితా తయారు చేశారని తెలిపారు. అయితే తొందరలోనో, సమయం లేకపోవడంతోనో 1999 నిషేధిత భూముల జాబితాను యథాతథంగా కలెక్టర్లకు అందించారని అన్నారు. దీంతో ఇదే జాబితాను కలెక్టర్లు సబ్రిజిస్ట్రార్లకు పంపించారని, ఫలితంగా గతంలో క్లియర్ అయినా, అన్ని సర్వే నంబర్లు నిషేధిత జాబితాలోకి వెళ్లిపోయాయని పేర్కొన్నారు. ఈ జాబితాపై అభ్యంతరాలు అడిగామని, అయితే దానిని ఎక్కడ పొందుపరిచామో తెలియక ప్రజలెవరూ చూసుకోలేదని అన్నారు. ఆ తర్వాత వారి భూములను విక్రయించే సమయంలో చూసుకునే సరికి నిషేధిత అంశం తెరపైకి వచ్చిందని, అప్పటినుంచి ఆందోళన మొదలైందని వివరించారు.
సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్‌తో మొదలు
కొన్ని సర్వే నంబర్లలో కొంత భాగం ప్రభుత్వ భూమి ఉండగా, మిగిలింది పట్టా భూమిగా ఉన్నదని సీఎం తెలిపారు. అయితే కొందరు సబ్ రిజిస్ట్రార్లు ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఫిర్యాదుతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేశారని తెలిపారు. మరొకరు ఏసీబీకి పట్టుబడ్డాడని చెప్పారు. ఇలా మే నెలలో ఒకేసారి నలుగురు సబ్ రిజిస్ట్రార్లు సస్పెండ్ అయ్యారని, ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్లు సమావేశమై, ప్రభుత్వ భూమి ఉన్న సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయొద్దని నిర్ణయించుకున్నారని తెలిపారు. అందులో ప్రభుత్వం భూమి ఎక్కడ ఉందో రెవెన్యూశాఖ కచ్చితంగా మార్క్ చేసి ఇస్తేనే, మిగిలిన భూముల రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. దీంతో సమస్య జటిలమైందని, రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయని చెప్పారు. అప్పటికే అధికారులు అప్లోడ్ చేసిన తప్పుడు జాబితాకు సబ్రిజిస్ట్రార్ల వ్యవహారం తోడై ఉప్పుకారం చల్లినైట్లెందని అన్నారు.
ప్రజలే నిరూపించుకోవాలి
30 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చామని ఒప్పుకొన్న సీఎం రేవంత్‌రెడ్డి.. వాటిని తొలగించడంపై మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వలేదు. పైగా ఆ బాధ్యతను ప్రజలపైనే పెట్టడం గమనార్హం. నిషేధిత జాబితాలో తమ భూమి లేదని ప్రజలే నిరూపించుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను, ఉత్తర్వులను చూపించాలని, తద్వారా జాబితా నుంచి తొలగించుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చడం, తొలగించే అధికారం ఆర్డీవో, సబ్ కలెక్టర్లకు ఇస్తున్నట్లు తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లో ఆర్డీవో, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయినా పరిష్కారం కాకపోతే 90 రోజుల్లో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు.