నర్సాపూర్ : పోలింగ్ రోజున ఓటర్లు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ ( Additional SP Mahender) సూచించారు. శుక్రవారం నర్సాపూర్( Narsapur ) మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పట్టణంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలతో పాటు బీవీఆర్పీటీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ , కౌంటింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ చేపట్టిన మౌలిక వసతులు, భద్రత ఏర్పాట్లు, సిబ్బంది ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా, పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా పరిశీలన చేపట్టానని వెల్లడించారు.
పోలింగ్ కేంద్రాల భద్రత ఏర్పాట్లపై నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 100 మీటర్ల నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సూచించారు. డబ్బు, మధ్యం బహుమతుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడం చట్టవిరుద్దమని హెచ్చరిస్తూ అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఎస్ఎస్ చెక్పోస్టును పరిశీలించారు.