హనుమకొండ చౌరస్తా : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈనెల 14 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్ జోన్ ఉప కమిషనర్ రాముల సునీత తెలిపారు. శుక్రవారం దేవాలయాన్ని సందర్శించిన ఆమె కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి అనిల్‌కుమార్, ఆర్యవైశ్య సంఘం రాష్ర్ట నాయకుడు గట్టు మహేష్‌బాబు, బ్రాహ్మణ సేవా సమితి రాష్ర్ట నాయకులు అయినవోలు వెంకట సత్యమోహన్, మున్నూరుకాపు సంఘం జిల్లా నాయకుడు గండ్రాతి రాజు, పద్మశాలి సంఘం జిల్లా నాయకులు మామిడాల గణపతి, వెలమ సంఘం రాష్ర్ట నాయకులు గుజ్జ సంపత్‌రావు, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఆలయ పరిచారకులు సందీప్‌శర్మ, సిబ్బంది ఎన్ మధుకర్, ఎల్ రామకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాముల సునీత మాట్లాడుతూ.. విద్యుత్ అధికారులు, మున్సిపల్, పోలీస్, ఆర్ అండ్ బీ, కేంద్ర పురావస్తుశాఖ, పోలీస్ శాఖ, సాంస్కృతిక శాఖ కలిసి సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని, ధర్మదర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ప్రాధాన్యత కల్పించాలని చలువ పందిళ్లు, తాగునీరు ఏర్పాటు చేయాలని, రుద్రాభిషేకం క్యూలైన్లో వచ్చే భక్తులకు వైదిక సిబ్బంది పూజలు నిర్వహించాలని, వీఐపీ లైన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు.
ఐదు రోజులపాటు విద్యుత్ అలంకరణ ఘనంగా ఏర్పాటు చేయాలని, కళ్యాణ ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు, తలంబ్రాలు అందించాలని, కళ్యాణ వేదిక ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అన్ని శాఖల వారికి లెటర్లు ఇవ్వడం జరిగిందని, 13వ తేదీ వరకు అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని, లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు, జాగరణ ఉండే భక్తులకు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని, తాగునీరు సౌకర్యం వాలంటరీస్ స్వచ్ఛంద సంస్థలతో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయని 15వ తేదీ మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివార్ల కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందని, 12 గంటలకు లింగోద్భవం, వేములవాడ, శ్రీశైలం మహానంది క్షేత్రాల్లో జరిగే విధంగానే రుద్రేశ్వరీ-రుద్రేశ్వరుల కల్యాణోత్సవం జరుగుతుందని ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ చెప్పారు.