Golden Milk | మనం ఎంతో కాలంగా పసుపును ఆహారంలో భాగంగా తీసుకుంటున్నాం. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని దీనిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. వంటల్లో వాడడంతో పాటు పాలల్లో కూడా పసుపును కలిపి తీసుకుంటూ ఉంటాం. బంగారు పాలని కూడా ఈ పసుపు కలిపిన పాలను పిలుస్తారు. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రాగానే చాలా మంది పాలల్లో పసుపు కలిపి తీసుకుంటారు. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి , అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి ఇలా తీసుకుంటూ ఉంటారు. పసుపు కలిపిన పాలను ఎందుకు తీసుకోవాలి.. దీనిని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే ఈ పాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీర్ఘాకాలిక వాపు తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారి తీస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపును, మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్ వంటి సమస్యలతో బాధపడే వారు పసుపు పాలను తీసుకోవడం వల్ల సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా పసుపు పాలల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి. పసుసు పాలను తాగడం వల్ల ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతుంది. దీంతో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ పసుపు పాలల్లో దాల్చిన చెక్క పొడి, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, ఉబ్బరం వంటి లక్షణాలు తగ్గుతాయి.
క్రమం తప్పకుండా పసుపు పాలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. రాత్రి సమయంలో పసుపు పాలు తాగడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. పసుపు పాలను తాగడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆందోళన, నిరాశ లక్షణాలు తగ్గించడంలో ఈ పాలు మనకు ఎంతో సహాయపడతాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పాలను తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఇక చలికాలంలో ఈ పాలను తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పాలను తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది. చలికాలంలో గొంతునొప్పి వంటి సమస్యలు తరచూ వస్తూ ఉంటాయి. ఆ సమయంలో గోరు వెచ్చని పాలల్లో పసుపు కలిపి తాగడం వల్ల గొంతు నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది. ఇక ఈ పాలను తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఒక కప్పు పాలల్లో టీ స్పూన్ పసుపు వేసి కలపాలి. తరువాత చిటికెడు మిరియాల పొడి వేసి కలుపుతూ వేడి చేయాలి. వీటిని ఎక్కువగా మరిగించకూడదు. పాలు వేడెక్కిన తరువాత కప్పులోకి తీసుకుని రుచి కోసం తేనె కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా పసుపు పాలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.