Viral video : మనుషులు బాధ్యతారాహిత్యంగా వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటమాడిన ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. ఇలాంటి చర్యలవల్ల వన్యప్రాణులకు హాని జరుగుతుంది. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లు డ్రోన్ పైలట్‌కు చీవాట్లు పెడుతున్నారు. ఎందుకింత బాధ్యతారాహిత్యమని మండిపడుతున్నారు.
‘droneshakk’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో ఈ ఘటన గురించి షేర్ చేశారు. ఆ వీడియోలో.. జార్జ్ అనే పేరుగల మొసలి బురదనీటిలో పడుకుని ఉంది. ఆ మొసలిని అత్యంత సమీపం నుంచి చిత్రించేందుకు ఓ డ్రోన్ పైలట్ దానిపైకి డ్రోన్‌ను పంపారు. ఆ డ్రోన్‌ను గమనించిన మొసలి దాన్ని తినే వస్తువుగా భావించి అమాంతం పైకెగిరి అందుకుంది. క్షణాల్లో మొసలి నోటి నుంచి దట్టమైన పొగలు బయటికి వచ్చాయి.
ఎందుకంటే ఆ డ్రోన్లోని లిథియం అయాన్ బ్యాటరీలు మొసలి నోట్లో పేలడంతో పొగలు వ్యాపించాయి. కాసేపటికి పొగలు తగ్గిన తర్వాత గమనిస్తే.. మొసలి ఆ డ్రోన్ కసిగా నములుతూ కనిపించింది. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూస్తున్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న మాటలు కూడా వీడియోలో స్పష్టం వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి బాధ్యతారహితమైన పనులవల్ల వన్యప్రాణుల ప్రాణాలకు హాని జరుగుతుందని అంటున్నారు. ఈ విషయం గురించి తెలుసుకున్న తర్వాతనైనా మిగతా వాళ్లు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారనే ఉద్దేశంతోనే తాను ఈ ఘటనను సోషల్ మీడియాలో పంచుకున్నానని ఇన్‌స్టా యూజర్ తెలిపారు.