ఎతాహ్, జనవరి 22: ఎన్నికలప్పుడొస్తారు.. హామీలు కురిపిస్తారు.. గెలిచాక మళ్లీ ఐదేండ్ల వరకు పత్తా ఉండరు.. రాజకీయ నాయకుల వ్యవహారశైలితో విసిగి వేసారిన ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామ ప్రజలు కీలక నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే నెలలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు తేల్చిచెప్పారు. ఎతాహ్ సదర్ నియోజకవర్గంలోని కుల్లా హబీబ్పూర్ గ్రామంలో రోడ్లు పాడయ్యాయి. గతుకుల రోడ్లతో ఎంతో మంది ప్రమాదానికి గురయ్యారు. ఈ సమస్యను గ్రామస్థులు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఇక లాభం లేదనుకొని ప్రజలంతా ఏకమై అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తామని చెప్తున్నారు. ప్రచారం కోసం ఏ పార్టీ నేత వచ్చినా ‘నో రోడ్.. నో వోట్’ అని స్పష్టం చేస్తున్నారు. రోడ్లు బాగుచేసినవారికే ఓటేస్తామని, లేకపోతే ఎన్నికలనే బహిష్కరిస్తామని తేల్చిచెప్పారు. ఎతాహ్ జిల్లా కేంద్రంలోని కాన్షీరాం కాలనీవాసులు కూడా రోడ్లు బాగుచేస్తేనే ఓట్లు వేస్తామని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. కాగా, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీకి చెందిన విపిన్ వర్మ డేవిడ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.