కొత్తగూడెం గణేష్ టెంపుల్, ఆగస్టు 08 : కొత్తగూడెంలోని విద్యాదరి ఫౌండేషన్ అధ్యక్షుడు బైరి రాజేష్ ఖన్నా శనివారం ఐఐటి విద్యార్థినికి ఆర్థిక సాయం అందజేసి ఆదుకున్నారు. కొత్తగూడెం రైటర్ బస్తి గొల్లగూడెంకు చెందిన టేకుమట్ల స్నేహిత పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించింది. బిలాస్పూర్ లోని స్కూల్ ఆఫ్ స్టడీస్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో ఐఐటీ సీటు ఎంట్రన్స్ ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంది. ఈ విషయాన్ని 28వ డివిజన్ కార్పొరేటర్ జల్లి శ్రీలక్ష్మి విద్యాధరి ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేష్ ఖన్నాకు వివరించారు. ఎంట్రన్స్ ఫీజు చెల్లించడానికి ఆఖరి రోజు అని తెలియజేయడంతో వెంటనే స్పందించిన రాజేష్ ఖన్నా రూ.10,000/- చెక్కును స్నేహితకు అందజేశారు.
ఈ సందర్భంగా రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదవాలని లక్ష్యం పెట్టుకున్న విద్యార్థులు ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న ర్యాంకర్లకు విద్యాధరి ఆధ్వర్యంలో ఆర్థిక సాయం చేస్తూ, వారు భవిష్యత్లో ప్రయోజకులుగా మారేందుకు సహాయం చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్య చదవాలనుకునే ఆశయమున్న పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందజేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యాదరి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.