కుభీర్ : తమ కాలనీలో డ్రైనేజీ ( Drainage ) సమస్యకు పరిష్కారం దొరికిందని ఆశించిన స్థానికులకు నిరాశే ఎదురైంది. సుమారు రూ. 76లక్షలతో నిర్మిస్తున్న డ్రైనేజీ కుప్పకూలడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుభీర్( Kubheer ) మండల కేంద్రం లోని మేదరి గల్లీ నుంచి పెద్దవాన వరకు హై లెవెల్ డ్రైనేజీ నిర్మాణం కోసం ఈజీఎస్ నిధుల కింద ప్రభుత్వం రూ. 76 లక్షలు మంజూరు చేసింది.

అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నాసిరకపు పనులతో ఆదిలోనే హంసపాడు ఎదురయినట్లు నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ కూలిపోవడం విస్మయానికి గురి చేసింది. పక్కనే మిషన్ భగీరథ ట్యాంకు కింద పైపుల్లోకి మురికినీరు చేరుతుండడంతో తాగునీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని , బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.