Puvvada Ajay | ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాగునీరు, విద్యుత్ కష్టాలతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
ఎల్ నినో ప్రభావం ఉంటుందని ముందుగానే తెలిసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో వ్యవహరించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, పోరాటాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం వల్ల ప్రస్తుతం పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థ పాలన కారణంగా పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, రైతులు భారీగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులకు తక్షణమే అవసరమైన సాగునీరు, విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి అత్యవసర ప్రాతిపదికన సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.