నిజామాబాద్, నవంబర్ 19, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌కు అహంకారం నెత్తికెక్కిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మండిపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడుతూ, అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. 11 నెలల్లో హామీలన్నీ నెరవేర్చామని పీసీసీ చీఫ్ చెప్పడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ‘నీ ఇష్టం ఉన్న ఊరు వెతుక్కో.. ఏ సెంటర్‌లోనైనా నిలబడి రైతుబంధు, రుణమాఫీ, బోనస్ రూ.500 పడిందా? అని రైతులను అడుగుదాం. వచ్చాయని వారు చెప్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా. లేదంటే నువ్వు పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తవా?’ అంటూ సవాల్ విసిరారు. ‘మేము అద్భుతమైన సెక్రటేరియట్ కడితే మీరు ఉన్న గేట్లను వాస్తు రూపంలో ఊడబీకుతున్నరు’ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టుకోకుండా చిలకజోస్యం చెప్తున్నాడని ఎద్దేవా చేశారు. ‘11 నెలల పాలనపై ఏ ఒక్కరిని అడిగినా కాంగ్రెస్ పార్టీని ఛీ.. తూ అని తిరుడుతున్నరు’ అంటూ దెప్పిపొడిచారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్‌రావుతో కలిసి వేముల మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ఢిల్లీ సంస్థ చేసిన కీలక సర్వేలో ఘోరమైన నిజాలు బయట పడ్డాయని తెలిపారు. ఈ దేశ చరిత్రలో అతి కొద్ది రోజుల్లోనే చెడ్డ పేరును, అపకీర్తిని మూట గట్టుకున్న ఏకైక ప్రభుత్వం ఇదేనంటూ విమర్శించారు. ప్రజలతో అనరాని మాటలు పడిన ఏకైక ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి నిలిచి పోతారని ఎద్దేవాచేశారు. హరీశ్‌రావు నిఖార్సయిన తెలంగాణ ఉద్యమకారుడని, రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ మాట తప్పితే గడ్డి పరకలా మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర ఆయనకు ఉన్నదని గుర్తుచేశారు. ‘మాటలు జాగ్రత్తగా మాట్లాడు.. ముందు నీ పార్టీలో ఏం జరుగుతున్నదో నీకు తెలుసా?’ అంటూ ఫైర్ అయ్యారు. ‘హెలికాప్టర్ కోసం కొట్లాడుకోవడం, మూటలు సమర్పించుకునే పనుల్లోనే మీ మంత్రులు, ఎమ్మెల్యేలు బిజీగా ఉన్నరు.. పొంగులేటి, శ్రీధర్ బాబు, భట్టి సీఎం రేసులో పోటీ పడుతూ రేవంత్‌రెడ్డికి ఎసరు పెడున్నరు’ అని చురకలంటించారు.
వరంగల్ రైతు డిక్లరేషన్‌ను గాలికొదిలి అదే ప్రాంతంలో విజయోత్సవాలు నిర్వహించుకోవడం సిగ్గుచేటని వేముల మండిపడ్డారు. ‘నీ అల్లుడి కోసం నువ్వు భూములు లాక్కుంటే.. మీ చర్యలను అడ్డుకున్నందుకు లంబాడా ప్రజలను చిత్రహింసలు పెడుతున్నరు.. మూసీ బాధితులు రోడ్డెక్కుతున్నరు. సీఎం రేవంత్‌రెడ్డికి దమ్మూధైర్యం ఉంటే చేసిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగర మేయర్ నీతూ కిరణ్ భర్త శేఖర్‌పై జరిగిన దాడిని వేముల తీవ్రంగా ఖండించారు. చంపాలనే కోరికతో నిందితుడు దాడి చేసి వీడియో రికార్డు చేసి బయట పెటాడని, ఈ ఘటన వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నదని ఆరోపించారు. నిందితుడు తాను కాంగ్రెస్‌వాదినని చెప్పుకోవడంపై ఆ పార్టీ నేతలు నోరు విప్పాలని, ఇందులో కుట్ర కోణంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో నుడా మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు సిర్ప రాజు, నాయకులు సుదాం రవిచంద్ర, సత్య ప్రకాశ్, మురళి, న్యాయవాది మధుసూదన్‌రావు, ఇమ్రాన్, యెండల ప్రదీప్ పాల్గొన్నారు.
‘రేవంత్‌రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాడా? సీఎం పదవి నుంచి తీసేయగానే పార్టీ మారుతాడని మీ వాళ్లే చెప్తున్నరు. పదేండ్లలో చేయని అభివృద్ధి 10 నెలల్లో పూర్తయిందని మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పడం సిగ్గుచేటు.. ఆ మాటలు వింటుంటే కరెంట్ తీగలు పట్టుకుని చావాల్సిన పరిస్థితి.. ఒక్కపనీ చేయకున్నా గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నది.. పీసీసీ పదవితో కండ్లు మూసుకు పోయాయి.. పేదల ఇండ్లను కూల్చడం తప్ప కాంగ్రె స్ ప్రభుత్వం నిలబెట్టిందేమిటి?’ అని వేముల నిప్పులు చెరిగారు. వరంగల్‌లో కాళోజీ కళాక్షేత్రం కేసీఆర్ గొప్పదనానికి ప్రతీక అని వివరించారు. కేసీఆర్ నిర్మించిన కట్టడానికి రేవంత్‌రెడ్డి రిబ్బన్ కట్ చేశారని చెప్పారు.