లక్నో: టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టీ20 జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పేట్టు లేదు. మంచి ఫామ్‌లో ఉన్న అతడిని వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడిస్తారా? లేక ఓపెనర్లుగా అభిషేక్-సంజూనే కొనసాగిస్తారా? అని చర్చలు సాగుతున్న నేపథ్యంలో భారత ప్రధాన కోచ్ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతీ స్పందిస్తూ.. ‘ఇది నాక్కూడా కొత్త అనుభవమే. అతడు (వైభవ్) మంచి ఫామ్‌లో ఉన్నాడు. కానీ జట్టులో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న నైపుణ్యం కల్గిన ఆటగాళ్లను తీసేసి ఉన్నఫళంగా అతడిని తీసుకోవడం కరెక్ట్ కాదు.
ఈ విషయాన్ని నేను వైభవ్‌కు అర్థమయ్యేలా చెప్పా. అతడు ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఒకవేళ వైభవ్‌ను ఆడించాల్సి వస్తే అభిషేక్, సంజూలలో ఎవరిని తప్పించాలన్నది చాలా కష్టమైన ప్రశ్న. గత రెండేండ్లుగా మెరుగ్గా ఆడుతున్న ఈ జోడీని మూడు, నాలుగు మ్యాచుల్లో సరిగ్గా ఆడలేదని, అదీగాక ఒక యువ ఆటగాడి కోసం తప్పించడం సరైన నిర్ణయం కాదు’ అని చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపిక విషయంలో మ్యాచ్‌కు తగ్గట్టు పరిస్థితులను బట్టి కెప్టెన్, కోచ్ నిర్ణయాలు తీసుకుంటారే తప్ప సోషల్ మీడియా ఒత్తిడితో టీమ్‌ను ఎంపిక చేయబోమని గౌతీ నొక్కిచెప్పాడు.