అగ్ర హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలేర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నది. ఈ సినిమా టికెట్ రేట్లను పెంచబోమని, సాధారణ రేట్లకే సినిమాను ప్రదర్శించబోతున్నామని మేకర్స్ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఏపీలో ఈ సినిమా ధరల్ని పెంచబోతున్నారనే వార్తల్ని చిత్రబృందం ఖండించింది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాలకు ఎలాంటి దరఖాస్తు చేయలేదని, సినిమా కంటెంట్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని మేకర్స్ ఆ ప్రకటనలో వెల్లడించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై వై.రవిశంకర్, ననీన్ యెర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
8వ తేదీన ట్రైలర్: ‘రణబాలి’ ట్రైలర్‌ను ఈ నెల 8న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని, విజయ్-రష్మిక ఇంటర్వ్యూలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.