బీజింగ్ : చైనా ఓపెన్‌లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్ ప్రయాణం వివాదాస్పదంగా ముగిసింది. పురుషుల సింగిల్స్‌లో సెమీస్ చేరిన అతడు.. సోమవారం జరిగిన పోరులో నొవాక్ జొకోవిచ్‌తో ఆడుతుండగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ ప్రేక్షకుడిని బంతితో కొట్టడంతో ఈ రష్యా స్టార్ అనర్హతకు గురయ్యాడు. సెమీస్ మ్యాచ్‌లో 5-7, 3-5తో వెనుకబడిన మెద్వెదెవ్‌ను ఉద్దేశిస్తూ బాక్స్‌లో కూర్చున్న ఓ వ్యక్తి పదే పదే కామెంట్స్ చేశాడు. దీంతో సహనం కోల్పోయిన మెద్వెదెవ్.. జొకో కొట్టిన బంతి అతడి వెనుకాల ఉన్న గోడకు తాకి రిట్నర్ రాగానే దానిని రాకెట్‌తో ఆ వ్యక్తిపైకి బలంగా కొట్టాడు.
బంతి కాస్తా సదరు వ్యక్తి ఎడుమ కన్నుకు బలంగా తాకడంతో అతడు నొప్పికి తాళలేక విలవిల్లాడాడు. దీంతో నిర్వాహకులు మెద్వెదెవ్‌ను డిస్క్వాలిఫై చేశారు. మ్యాచ్ ముగిశాక మెద్వెదెవ్.. ఆ ప్రేక్షకుడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. 2020 యూఎస్ ఓపెన్‌లో జొకో.. లైన్ జడ్జిపైనా ఇదే విధంగా కొట్టడంతో అతడు అనర్హతకు గురైన విషయం తెలిసిందే. ఇదిలాఉండగా మరో సెమీస్‌లో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా).. 6-3, 4-2తో హుబర్ట్ హుర్కాజ్ (పోలెండ్)పై గెలిచి జొకోతో ఫైనల్స్‌కు సిద్ధమయ్యాడు. గాయం కారణంగా హుబర్ట్ రెండు సెట్లు కూడా ఆడకుండానే టోర్నీ నుంచి వైదొలిగాడు.