హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని రైతులకు యూరియాను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకున్నది. యాప్ ద్వారా బుకింగ్‌కు ఇబ్బందులు పడుతున్న రైతులు ఇకపై కేవలం రూ.10 సేవా రుసుముతో మీ సేవ కేంద్రాల్లో బుక్ చేసుకోచ్చని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. పట్దాదారు పాస్‌బుక్ నంబర్, ఓటీపీ ధ్రువీకరణ ద్వారా లభించే బుకింగ్ ఐడీ 48 గంటలపాటు చెల్లుబాటవుతుందని చెప్పారు. నిర్దేశిత గడువులోగా ఎంపిక చేసిన డీలర్ నుంచి యూరియా కొనుగోలు చేయాలని సూచించారు.
యాసంగిలో తెలంగాణకు యూరియాను అదనంగా కేటాయించి ఏప్రిల్ నుంచి జూన్ వరకు లోటును భర్తీచేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు బుధవారం లేఖ రాశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 55.52 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగుచేశారని, ఈ పరిస్థితుల్లో ఎరువుల అవసరం కూడా పెరిగిందని పేర్కొన్నారు. రామగుండంలోని ఆర్ఎఫ్సీఎల్ నుంచి 90 శాతం తెలంగాణకు కేటాయించాలని కోరారు.