లక్నో: ఉత్తరప్రదేశ్, బీహార్ కలిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎలా దించొచ్చని అనుకుంటున్నారా.. అవును ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడంతోనే బీజేపీ ఎన్డీయే సర్కార్‌ను ఏర్పాటుచేసింది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. బీహార్‌లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్.. ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. అక్కడ మహఘట్‌బంధన్ కూటమి నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో బీహార్‌లో ప్రతిపక్షాలు ఎలా జట్టుకట్టాయో.. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఒక్కటవ్వాలని సమాజ్‌వాదీ పార్టీ నేతలు కోరుకుంటున్నారు. ఆ సంకేతాలను సూచిస్తూ లక్నోలోని ఎస్పీ ప్రధాన కార్యాలయం బయట ఓ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. అందులో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫొటోలను ముద్రించారు. యూపీ + బీహార్= గయూ మోదీ సర్కార్ (మోదీ ప్రభుత్వం ఔట్) అని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఒక్కటైతే బీజేపీ 50 స్థానాలకే పరిమితమవుతుందని ఆ పార్టీ నేత ఐఈ సింగ్ అన్నారు. దీంతో కేంద్రంలో మోదీ సర్కార్ ఏర్పాటు కాకుండా అడ్డుకోవచ్చని చెప్పారు.