అమరావతి : తెలంగాణలోని కొండగట్టు( Kondagattu) , కరీంనగర్, ఇల్లంతకుంట రామాలయాలను అభివృద్ధి చేయాలని టీటీడీని( TTD) కోరానని కేంద్ర మంత్రి బండి సంజయ్( Minister Bandi Sanjauy) తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో మంత్రిని అధికారులు సన్మానించారు.
బండి సంజయ్ మాట్లాడుతూ పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని, దూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలను రక్షించాలని కోరినట్లు తెలిపారు. టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్థులున్నారని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి, భక్తులు శిలాతోరణం వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 63,473 మంది భక్తులు దర్శించుకోగా 27,796 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు చెల్లించుకున్న మొక్కుల ద్వారా శ్రీవారి హుండీకి రూ. 4.54 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.