– పదేళ్ల కాలంలో పండుగల వ్యవసాయం
– కాంగ్రెస్ పాలనలో సాగు రంగం నిర్వీర్యం
– మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెబితేనే రైతులు గుర్తుకొస్తారు
– గుడిమళ్ల రోడ్ షోలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 06 : స్వయంగా కేసీఆర్ రైతు కావడంతో ఆనాడు బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయ రంగం కొత్త పుంతలు తొక్కిందని తద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకోవడం జరిగిందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12వ వార్డులకు పోటీ చేస్తున్న మరియమ్మ, పేరం రమాదేవి, మొర్రి మేకల సత్యనారాయణ, విజయా విషయాన్ని కాంక్షిస్తూ గుడిమళ్లలో రోడ్ షో నిర్వహించారు. గ్రామ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గుదిమల్ల గ్రామ ప్రజలు బీఆర్ఎస్, సీపీఎం నాయకులకు బ్రహ్మరథం పట్టారు. రోడ్ల పొడవునా గులాబీ, సిపిఎం జెండాలు రెపరెపలాడాయి. రెండు గంటలపాటు గ్రామంలో రోడ్ షో జరిగింది. అనంతరం జరిగిన సభలో సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావుతో కలిసి వారు మాట్లాడారు.

‘రైతు బాంధవుడు కేసీఆర్’
ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగానికి జవసత్వాలు తీసుకువచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న కొద్ది రోజులకే నిరంతరాయ కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి చారిత్రాత్మక పథకాలు ప్రవేశపెట్టి కేసిఆర్ యావత్ దేశానికి మార్గదర్శకం అయ్యారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో రుణమాఫీ తో పాటు రైతుబంధు పథకం ప్రవేశపెట్టి లక్షలాది మంది రైతులకు రైతు బాంధవుడుగా పేరు ప్రఖ్యాతులు కూడగట్టుకోవడం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడంతో పాటు రైతుల వెన్ను విరిచిందని విమర్శించారు. కనీసం విత్తనాలను సరఫరా చేయలేక, యూరియా లేక, పంటల పెట్టుబడి లేక, అరకొరా రుణమాఫీతో రైతులు అవస్థలు పడుతున్నారన్నారు.

‘రైతు బాంధవుడు కేసీఆర్’
ఈ ప్రాంతంలో గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్రంలోనే నెంబర్ టు అని చెప్పుకుంటూ రోజులు వెళ్లదీస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు మాత్రం గోస వెళ్లబోచుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుల మత రాజకీయాలకు అతీతంగా సంఘటితం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో సిపిఎం, బీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులకు మంచి మెజారిటీ అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పాలేరు డివిజన్ కార్యదర్శి బండి రమేష్, ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, పేరం వెంకటేశ్వర్లు, తిరుపతిరావు పాల్గొన్నారు.