Jeevan Reddy : జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయంగా తన మెడ నరకడానికి కాంగ్రెస్ పార్టీలో ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తన భుజాలుగా ఉన్న వ్యక్తులను తనకు దూరం చేశారని చెప్పారు.
పార్టీ మారితే రాళ్లతో కొట్టమని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ప్రచారం సందర్భంగా పార్టీకి చెందిన మహిళలు, కార్యకర్తలతో ఆయన తన బాధను చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు. దాంతో వారు జీవన్‌రెడ్డిని ఓదార్చారు. మున్సిపాలిటీలో తాము మీ వర్గాన్ని గెలిపించి తీరుతామని చెప్పారు. కాగా చట్టసభలకు ఏ పార్టీ తరఫున గెలిస్తే ఆ పార్టీలోనే ఉండాలని గతంలో రాహుల్‌గాంధీ చెప్పిన విషయాన్ని జీవన్‌రెడ్డి గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి ఆయన పార్టీ మారితే రాళ్లతో కొట్టాలని గతంలో చెప్పారని, కానీ ఆయనే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. వేరే పార్టీల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్లను ఓటుతో కొట్టాలని తాను అంటున్నానని చెప్పారు. తన వర్గం వారికి కాంగ్రెస్ సీట్లు నిరాకరించడంతో కొన్ని వార్డుల్లో స్వతంత్య్రులుగా బరిలో దిగిన తన వర్గం వారి తరఫున జీవన్‌రెడ్డి ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గాన్ని పక్కనపెట్టి.. తనతోపాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ కుమార్ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్లోనే ఉన్నా అంటూ సంజయ్ కాంగ్రెస్ జెండాను ఎత్తుకుపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానించారు.