కౌలాలంపూర్: ఈ ఏడాది తొలి ఐసీసీ టోర్నీ అయిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌నకు శనివారంతో తెరలేవనుంది. రెండో ఎడిషన్‌గా జరుగబోయే ఈ మెగాటోర్నీకి కౌలాలంపూర్(మలేషియా) ఆతిథ్యమిస్తున్నది. 16 జట్లు పాల్గొంటున్న ఈ ప్రపంచకప్‌లో భారత్.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగుతోంది. ఈనెల 18 నుంచి ఫిబ్రవరి 02 దాకా జరుగబోయే ఈ టోర్నీలో శనివారం ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. ఆదివారం వెస్టిండీస్ మ్యాచ్‌తో భారత్ టైటిల్ వేటను ఆరంభించనుంది.
2023లో జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను షఫాలీ వర్మ సారథ్యంలోని టీమ్ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా ఎడిషన్‌లో భారత్‌కు నికీ ప్రసాద్ సారథిగా వ్యవహరిస్తున్నది. తెలంగాణ యువ క్రికెటర్లు గొంగడి త్రిష, కేసరి ధృతితో పాటు విశాఖపట్నం అమ్మాయి ఎండీ షబ్నమ్ భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. గత కొన్నాళ్లుగా బ్యాటింగ్‌లో నిలకడగా ఆడుతూ జట్టులో చోటు దక్కించుకున్న త్రిష.. అంతర్జాతీయ స్థాయిలో మరోమారు సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. యువ బ్యాటర్లు, బౌలర్లతో సమతూకంగా ఉన్న టీమ్ఇండియా టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.
16 జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి ఆడే ఈ టోర్నీ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. లీగ్ దశలో ఒక్కో గ్రూప్ నుంచి టాప్-3 జట్లు సూపర్ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. సూపర్ సిక్స్ దశలో ఒక్కో జట్టు ఇతర గ్రూప్‌లోని జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ దశలో టాప్-2లో నిలిచే 4 జట్లు సెమీస్‌కు వెళ్తాయి. జనవరి 31న రెండు సెమీస్ మ్యాచ్‌లు, ఫిబ్రవరి 02న ఫైనల్ జరుగనుంది.