సిరిసిల్ల రూరల్, మే 26 : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనతో స్వగ్రామమైన తంగళ్లపల్లి మండల కేంద్రంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన నేతకార్మికుడు చేరాల రాజేశం దంపతుల కొడుకు ప్రసన్నకుమార్(27), కూతురు ఉన్నారు. ప్రసన్నకుమార్ హైదరాబాద్‌లోని కోఠిలో స్నేహితులతో కలిసి ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. ఇటీవల ఫార్మసిస్టు ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు.
ఈ క్రమంలో ఉద్యోగం రావడంలేదని డిప్రెషన్‌కు లోనయ్యాడు. సోమవారం స్నేహితులు వాకింగ్‌కు వెళ్లగా, తాను ఉంటున్న అద్దె గదిలోని బాత్రూంలో టవల్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితులు పోలీసులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి పోస్ట్‌మార్టం తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.