మునగాల, ఫిబ్రవరి 10 : సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని బారాకత్ గూడెం గ్రామానికి చెందిన కౌలు రైతు చల్ల సైదులు 13 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. అందులో మూడు ఎకరాల వరకు ఎర్ర తెగులు వచ్చి పంట చేను ఎండిపోతుంది. ఆయనకు స్మార్ట్ ఫోన్ లేకపోవడం, తెలిసిన వారి ద్వారా యూరియా బుకింగ్ కోసం ప్రయత్నించినా దొరకక పోవడంతో తీవ్ర నిర్వేదంలోకి వెళ్లాడు. పంటను ఎలాగైనా బ్రతికించుకునేందుకు చుట్టుప్రక్కల వాళ్ల సలహా మేరకు నూకల్లో మూడు బీర్లు కలిపి పొలంలో చల్లాడు.
బాధిత రైతు దీనిపై స్పందిస్తూ.. అన్నీ తెలిసిన వాళ్లకే యూరియా దొరకడం లేదని, ఇక తనలాంటి చదువురాని వారి బాధ ఎవరికి చెప్పుకోవాలన్నారు. తమలాంటి చదువురాని రైతులు రూ.250 యూరియా కోసం రూ.20 వేల ఫోన్ కొనాలా? ఫోన్ వాడటం ఎలా? పఏద ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ఇలా ఇబ్బందులు పెట్టడం ఏంటని, తమలాంటి చదువురాని వారు వ్యవసాయం చేయొద్దా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లైన్లో నిలబడినప్పుడే తమకు యూరియా దొరికిందని, ఇప్పుడు అసలే దొరకడం లేదని వాపోయాడు. యూరియా దొరకకపోవడంతో చేసేది లేక నూకల్లో బీరు కలిపి పొలంలో చల్లినట్టు పేర్కొన్నాడు.