ఝరాసంగం, ఫిబ్రవరి 10: అష్టతీర్థముల సంగమం, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకీ సంగమేశ్వరస్వామి ఆలయంలో మహా శివరాత్రి సవాహిక్నిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నిత్యపూజా కార్యక్రమాలతో, భక్తుల రద్దీతో ఆలయమంతా సందడిగా మారనుంది. జాతరను పునస్కరించుకొని ఆలయాన్ని విద్యుత్దీప కాంతులతతో అలంకరించారు.
మహా శివరాత్రి నవహిక్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం అంకురార్పణం, ద్వజారోహణం, విజ్జేశ్వరపూజ, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, శిఖర పూజ, రాత్రి పల్లకిసేవ, భజనలు నిర్వహిస్తారు. గురువారం, శుక్రవారం, శనివారం కూడా ఇవే సేవలు కొనసాగుతాయి. ఆదివారం మహాశివరాత్రిని పునస్కరించుకొని.. అగ్ని ప్రతిష్ట, గణపతి హోమం, స్వామివారికి అభిషేకం, రాత్రి లింగోద్భవ సమయంలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిపిస్తారు. రుత్విక్కరణ, పల్లకి సేవ, భజనలతో ఆ రోజంతా శోభాయమానంగా ఉంటుంది.
సోమవారం స్వామివారికి రుద్రభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార హోమము, నవగ్రహ శాంతి హోమం, సాయంత్రం నందివాహన సేవ, రాత్రి అగ్నిగుండం పూజ, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు ఉంటాయి. మంగళవారం ఉదయం అగ్నిగుండం, స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రుద్రస్వాహకార హోమం, పూర్ణాహుతి, సాయంత్రం పార్వతీ సంగమేశ్వర స్వామి కల్యాణోత్సవం, రాత్రి స్వామివారికి విమాన రథోత్సవం కన్నులపండువగా నిర్వహిస్తారు. బుధవారం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, రాత్రికి పల్లకిసేవ, భజనలు.. మరుసటి రోజుస్వామివారికి రుద్రభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, లక్షబిల్వార్చన, అన్నదానం, రాత్రికి పల్లకి సేవతో జాతర ముగుస్తుంది.
సంగారెడ్డి అతిపెద్దది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లే 65వ జాతీయ రహదారిపైనున్న జహీరాబాద్ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో కేతకీ ఆలయం ఉంటుంది. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో స్నానాలు చేస్తే శుభం జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు.