కొల్చారం, డిసెంబర్ 26 : ఫ్లెక్సీ తొలిగిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై ఇద్దరు యువకులు మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. సీఎం రేవంత్ ఏడుపాయల దర్శనానికి బుధవారం రావడంతో పోతంశెట్టిపల్లి నుంచి మెదక్ వరకు జాతీయ రహదారిపై భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన అనంతరం సదరు కాంట్రాక్టర్ ఫ్లెక్సీలను తొలిగిస్తూ కిష్టాపూర్ వద్ద 11 కేవీ విద్యుత్తు వైర్లకు సమీపంలో ప్రమాదకరంగా ఉన్న ఫ్ల్లెక్సీని వదిలివేశారు. గ్రామానికి చెందిన అక్కెం యాదగిరి- భాగ్య కుమారుడు నవీన్ (21), పసుల వెంకటేశం-సుజాత కుమారుడు ప్రసాద్(20) బుధవారం రాత్రి నారుమడిలోకి అడవి పందులు రాకుండా నిప్పు వెలిగించి తిరిగి వస్తూ రోడ్డుపై ఉన్న భారీ ఫ్లెక్సీని తొలిగించే ప్రయత్నం చేశారు. ఫ్లెక్సీకి సపోర్ట్‌గా ఉన్న తాళ్లు తొలిగించడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న 11కేవీ విద్యుత్ వైర్లపై పడింది. దీంతో కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదుమేరకు కొల్చారం ఎస్సై గౌస్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. రైతులు పొలాలకు వెళ్లేదారిలో విద్యుత్తు వైర్లకు దగ్గరగా ఫ్లెక్సీలు పెట్టడంతోనే యువకులు మరణించారని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.