Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఓ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒక మహిళా కూడా ఉన్నారు. దొంగల నుంచి 20 గ్రాముల బంగారం, 720 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 36 గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను హబీబ్ మహమ్మద్(35), మహజబీన్ షరీఫ్(39)గా పోలీసులు గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఈ ఇద్దరు దొంగలు హైదరాబాద్‌లో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఆయా కాలనీల్లో దొంగలు సంచరిస్తూ.. తాళం వేసి ఉన్న నివాసాలను టార్గెట్ చేసుకుని దోపిడీకి పాల్పడుతున్నట్లు తేలింది. రాత్రివేళ హబీబ్ దొంగతనాలకు పాల్పడుతూ.. విలువైన వస్తువులను దోచుకుంటున్నట్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆ వస్తువులను షరీఫ్‌కు అప్పగించేవారు. ఆ వస్తువులను విక్రయించగా వచ్చిన డబ్బులను ఇద్దరూ పంచుకునే వారని పోలీసుల విచారణలో తేలింది. హబీబ్ 50 దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.