జడ్చర్లటౌన్, మే 11 : ఓ వ్యవసాయ పొలంలో స్తంభం పాతేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో ఇద్దరు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం జడ్చర్లలో చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం .. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం దేవునిగుట్టతండా శివారులోని వ్యవసాయ పొలంలో విద్యుత్తు స్తంభం పాతేందుకు కావేరమ్మపేటకు చెందిన ఆంజనేయులు (35), బండమీదిపల్లికి చెందిన మనీశ్‌కుమార్ (24)వెళ్లారు.
డ్రిల్లింగ్ మిషన్ ట్రాక్టర్‌తో గుంతతీసే క్రమంలో 11కేవీ విద్యుత్తు తీగలు డ్రిల్లింగ్ మిషన్ ట్రాక్టర్‌కు తగిలి కరెంటు సరఫరా కావడంతో ట్రాక్టర్ డ్రైవర్ మనీశ్‌కుమార్, పక్కనే ఉన్న ఆంజనేయులు అక్కడికక్కడే మృతిచెందారు. జడ్చర్ల సీఐ కమలాకర్ అక్కడకు చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.