Tirupati | తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేశారు. లైంగిక దాడికి పాల్పడ్డ డాక్టర్ లక్ష్మణ్ కుమార్‌తో పాటు అతనికి సహకరించిన ఎ.శేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఒడిశాకు చెందిన ఓ యువతి (27) బీఈడీ ఫస్టియర్ చదువుతోంది. ఆమెపై వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ కన్నేశాడు. విద్యార్థినిని ప్రలోభపెట్టి తన కార్యాలయంలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో మరో ప్రొఫెసర్ డాక్టర్ ఏ.శేఖర్ రెడ్డి ఫొటోలు, వీడియోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతానని విద్యార్థినిని బెదిరించి లైంగికంగా వేధించాడు. ఈ ఇద్దరు ప్రొఫెసర్ల వేధింపులు తట్టుకోలేని విద్యార్థిని వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేసి.. తన స్వగ్రామానికి వెళ్లిపోయింది.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న వర్సిటీ అధికారులు అంతర్గత విచారణ కమిటీని నియమించి డాక్టర్ లక్ష్మణ్‌కుమార్‌ను సస్సెండ్ చేశారు. అనంతరం దీనిపై వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్ రజినీకాంత్ శుక్లా తిరుపతి పడమర పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు జరిపారు. సీఐ మురళీమోహన్ ఆధ్వర్యంలోని ఓ బృందం బాధితురాలి స్వగ్రామానికి వెళ్లి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. బాధితురాలి నుంచి ఫిర్యాదును తీసుకుని ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లను అరెస్టు చేశారు.