Pawan Kalyan | న్యాయవ్యవస్థను భయపెట్టేలా, రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్‌కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.
శబరిమల ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం మార్చినపుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెలువడ్డాయని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. ఆ తీర్పు వల్ల సామాజిక అశాంతి చెలరేగినా.. అప్పట్లో ఏ న్యాయమూర్తిపైనా అభిశంసన ప్రతిపాదన తీసుకురాలేదని తెలిపారు. కేవలం తీర్పుపై న్యాయపరమైన పునఃపరిశీలన మాత్రమే జరిగిందని పేర్కొన్నారు. అలాగే ఓ మాజీ సీజేఐ హిందూ భక్తుల విశ్వాసాన్ని కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అదే ఆ మాజీ సీజేఐపై న్యాయవాది విమర్శలు చేస్తే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయని తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి చర్యలు తీసుకుని రాజకీయ పార్టీలు.. ఇప్పుడు హిందూ ఆలయానికి చెందిన భూమిలో దీపం వెలిగించడం, సంప్రదాయాలను పాటించడం భక్తుల హక్కు అని తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకున్నారని మండిపడ్డారు.ఆ తీర్పునకు ప్రతిగా డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి ఎంపీలు 120 మందికిపైగా న్యాయమూర్తి అభిశంసనకు నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపులేనని స్పష్టం చేశారు.
భారత రాజ్యాంగం ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే ‘సాక్ష్యాలతో నిర్ధారిత దుర్వినియోగం లేదా అశక్తత’ అవసరమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కేవలం ఒక తీర్పు నచ్చలేదన్న కారణంతో ఇంపీచ్మెంట్ నోటీసులు ఇవ్వడం రాజకీయ బెదిరింపేనని అన్నారు. హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలపై కేసుల్లో తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్న సందేశాన్ని పంపే ప్రయత్నమే ఇదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలు న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ముప్పుగా మారుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయ పక్షపాతం లేకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలంటే సంస్థాగత మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆలయ వ్యవహారాలను భక్తులే స్వయంగా నిర్వహించుకునేలా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ జోక్యం లేకుండా, మతపరమైన వ్యవహారాలు శాంతియుతంగా సాగేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు.
VIDEO | Delhi: DMK leader Kanimozhi submits an Impeachment Notice to Lok Sabha Speaker Om Birla, seeking the removal of Madras High Court Judge G R Swaminathan, after obtaining signatures from more than 120 MPs.
Congress MP Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh… pic.twitter.com/yzn9gq2lio
— Press Trust of India (@PTI_News) December 9, 2025
హిందూ ధర్మాన్ని ఆచరించడం కూడా రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సనాతన ధర్మం ఆచరించడం ఇతర మతాలకు వ్యతిరేకం కాదని తెలిపారు. సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించడమేనని.. ఆ గౌరవం హిందువులకు కూడా దక్కాలని అన్నారు.