Pawan Kalyan | రెండు దశాబ్దాల రోడ్డు వెతకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిష్కారం చూపించారు. ఐఎస్ జగన్నాథపురం పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో బాంగా రెండు రోడ్ల నిర్మాణానికి రూ.7.60 కోట్లు మంజూరు చేయించారు.
పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల పరిధిలోని తిమ్మనకుంట – గవరవరం మధ్య రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో ఆయా గ్రామాల ప్రజలు రెండు దశాబ్దాలుగా ప్రయాణ కష్టాలు అనుభవిస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురం పర్యటనలో జనాన్ని తప్పించుకుంటూ పవన్ కల్యాణ్ వద్దకు బిడ్డను ఎత్తుకుని వచ్చిన ఓ మహిళ ఆ రోడ్డు దుస్థితిని వివరించారు. ఆ మహిళ ఆవేదనను విని చలించిపోయి, పల్లె పండగ 2.0లో భాగంగా సాస్కీ నిధులతో తిమ్మనకుంట – యర్రవరం రోడ్డు నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పవన్ కల్యాణ్ ఆదేశించారు. 9 కి.మీ. రోడ్డు నిర్మాణం కోసం రూ. 7 కోట్లు మంజూరు చేశారు. దీంతో పాటు అదే నియోజకవర్గ పరిధిలో- యర్రంపేట గ్రామానికి చెందిన రైతుల కోరిక మేరకు పంట పొలాల మధ్యకు వెళ్లే 3 కిలోమీటర్ల డొంక రోడ్డు నిర్మాణానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి రూ.60 లక్షలను మంజూరు చేయించారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా,మార్కెటింగ్‌లో కీలకపాత్ర పోషించే డొంక రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.