US Visa | డోనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వలసలను నియంత్రించేందుకు పలు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ తాజాగా సోషల్మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఒకే లక్ష్యాన్ని అనుసరిస్తున్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియ ఆగదని పేర్కొంది. అంతేకాకుండా దీనికి ట్రంప్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్ను పోస్టు చేసింది. దానిపై మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే క్యాప్షన్ కూడా ఉండటం గమనార్హం.
కాగా, వీసాల రద్దుకు సంబంధించి అమెరికాకు చెందిన ఓ సీనియర్ విదేశాంగ శాఖ అధికారి కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. అమెరికా రద్దు చేసిన వీసాల్లో 8 వేలకు పైగా విద్యార్థులనేనని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడపడం, దొంగతనం, దాడుల వంటి నేరాలను ప్రధాన కారణాలుగా చూపిస్తూ వీసాలు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. జనవరి నుంచి జరిగిన వీసా రద్దుల్లో సగం ఇలాంటి కారణాల వల్లేనని సీఎన్ఎన్ మీడియాకు ఆయన వివరించారు. మిగిలిన వీసాల రద్దుపై మాత్రం పూర్తి వివరాలను వెల్లడించలేదు.
85,000 visa revocations since January.
President Trump and Secretary Rubio adhere to one simple mandate, and they won’t stop anytime soon⤵️ pic.twitter.com/fbNYw9wj71
— Department of State (@StateDept) December 9, 2025
వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినట్లు అనుమానాలు వంటి కారణాలతోనూ వీసాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్లో కన్సర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్న కొందరి వీసాలను కూడా అమెరికా రద్దు చేసింది. అలాగే గాజా యుద్ధానికి సంబంధించి జరిగిన నిరసనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులపైనా అమెరికా ప్రత్యేక నిఘా పెట్టింది. ఈ చర్యలన్నీ కూడా కంటిన్యూస్ వెట్టింగ్ అనే కొత్త విధానంలో భాగమేనని అమెరికా అధికారులు తెలిపారు. చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయులపై నిరంతర పర్యవేక్షణ పెట్టాలన్నది ఈ విధాన లక్ష్యమని చెప్పారు.