అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) పదే పదే వల్లిస్తున్న సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన అని వైసీపీ నాయకుడు , మాజీ మంత్రి పేర్ని నాని ( Perni Nani ) ఎద్దేవా చేశారు. ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో ఆయన ముందుంటారని విమర్శించారు.
మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ జీడీపీ( AP GDP ) వేగంగా పెరిగి సంపద సృష్టిస్తే దానిని చంద్రబాబు ప్రభుత్వం వాడుకుంటుందని ఆరోపించారు. మూలధన పెట్టుబడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు.
చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలోని లక్షా 91 వేల కోట్ల ఆస్తులను తాకట్టు పెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారని పేర్కొన్నారు. 18 నెలల కాలంలో 2 లక్షల 66 వేల 516 కోట్లు అప్పు తీసుకొచ్చి డబ్బు ఎక్కడ పెట్టారని ప్రశ్నించారు.
ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారని, దేశానికి ధాన్యగారంగా పేరున్న ఆంధ్రప్రదేశ్‌ను భ్రష్టుపట్టించారని పేర్నినాని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.