గాజా సిటీ, అక్టోబర్ 7: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై మంగళవారంతో రెండేండ్లు పూర్తయింది. యుద్ధంలో హమాస్ గ్రూపు బలహీనపడిందే తప్ప పూర్తి ఓటమి చెందలేదు. పశ్చిమాసియాలో తన శత్రువులపై ఇజ్రాయెల్ దాడి చేసినప్పటికీ ఆశించిన లక్ష్యాలను సాధించడంలో మాత్రం విఫలమైంది. ఈ యుద్ధం ఎలా ముగుస్తుందో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది.
వేలల్లో పాలస్తీనీయుల మృతి
గాజా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7 నుంచి 2025 సెప్టెంబర్ 24 వరకు గాజాలో 65,419 మంది పాలస్తీనీయులు మరణించగా 1.67 లక్షల మంది గాయపడ్డారు. జనాభాలో 22 శాతం మంది అంటే 4.70 లక్షల మంది తిండిలేక అలమటిస్తున్నారు. ఇజ్రాయెలీ దాడుల్లో నేటికీ ప్రతిరోజు సుమారు 100 మంది మరణిస్తున్నట్లు పాలస్తీనాలోని ఐక్యరాజ్యసమితి సహాయక కార్యకలాపాల సంస్థ తెలిపింది. ఆకలి, వైద్య సౌకర్యాలు అందక పలువురు మరణిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం ఏజెన్సీ నిర్వహిస్తున్న షెల్టర్లలో 845 మంది మరణించారు.
గాజాలో విధ్వంసం
గడచిన రెండేళ్ల కాలంలో గాజా తీవ్ర విధ్వంసానికి గురయ్యింది. 90 శాతం మంది నిరాశ్రయులయ్యారు. అనేక కుటుంబాలు బలవంతంగా గాజా నుంచి వెళ్లిపోవలసి వచ్చింది. 98 శాతం సాగునేల సేద్యానికి పనికిరాకుండా పోయింది. 92 శాతం స్కూలు భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 40 శాతానికిపైగా కుటుంబాలు చెత్త డంపింగ్ యార్డులలో నివసిస్తుండగా 60 శాతం మందికి స్నానం చేసేందుకు సోపు లేదు.
హమాస్ నాయకత్వం కకావికలం
గడచిన రెండేళ్లలో యావత్ హమాస్ అగ్ర నాయకత్వాన్ని ఇజ్రాయెల్ దాదాపు తుడిచిపెట్టింది. 2024 జనవరి 2న లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమాస్ డిప్యుటీ చీఫ్ సలే అల్-అరౌరీ మరణించాడు. అదే ఏడాది జూలై 13న ఖాన్ యూనిస్‌లో జరిగిన దాడిలో హమాస్ మిలిటరీ చీఫ్ మొహమ్మద్ దెయీఫ్ మరణించాడు. 2024 జూలై 31టెహ్రాన్‌లోని తన నివాసంలో జరిగిన బాంబు పేలుడులో హమాస్ రాజకీయ అధిపతి ఇస్మాయిల్ హనీయే మరణించాడు. అదే ఏడాది అక్టోబర్ 16న సెంట్రల్ గాజాలోని ఓ భవనంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మరణించాడు. 2025 మే 14న గాజాలోని ఓ దవాఖాన కింద ఉన్న సొరంగంపై జరిగిన వైమానిక దాడిలో హమాస్ చీఫ్ మొహ్మద్ సిన్వార్ మరణించాడు. ఇప్పటివరకు హమాస్ 25,000 మంది యోధులను కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 3న సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. హమాస్ కమాండర్లందరూ మరణించారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఆకలి మంటల్లో పాలస్తీనా
అత్యంత విధ్వంసకర యుద్ధంగా పరిగణిస్తున్న ఈ సమరంలో యావత్ పాలస్తీనా ధ్వంసమైంది. అంతటా దుర్భిక్షం తాండవిస్తోంది. అనేక మంది ఆకలిచావులకు గురయ్యారు. గాజాలో కాల్పుల విరమణ కోసం ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికకు హమాస్ కూడా అంగీకారం తెలిపిన వెంటనే ఆ ప్రాంతంలో రెండేళ్ల యుద్ధం ముగిసే అవకాశం ఉంది.