యాదగిరిగుట్ట, అక్టోబర్ 22: ‘మమ్మల్ని ఊరి నుంచి వెళ్లగొట్టేందుకే మీకు ఓట్లేసి గెలిపించినమా? రిజినల్ రింగ్ రోడ్డుతో మా ఊరికి అన్యాయం జరుగుతుంది. మీరు చాలా మోసం చేస్తున్నారు’ అంటూ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యపై ట్రిపుల్ ఆర్ బాధితురాలు బొల్లారం మల్లమ్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘రోడ్డు కావాలి.. అయితే మేం బతికేందుకు కూడా భూములుండాలి కదా?’ అని నిరసన వ్యక్తం చేశారు. బుధవారం యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు.
ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న రైతులు ఒక్కసారిగా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు రావాలి కానీ, భూములు కోల్పోయిన వారికి కూడా బతుకు దెరువు చూపించాలి కదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట నుంచి దాతారుపల్లికి వచ్చేందుకు రోడ్డు వేస్తే ఎంతో మంది తమ భూములు ఇచ్చారు కదా? ఇది కూడా అంతే.. అంటూ పొంతనలేని సమాధానమిచ్చారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు ఓట్లేసి గెలిపించినందుకు ఊరినే వదిలివెళ్లే పరిస్థితి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కనీసం భూములు కోల్పోయిన వారికి మార్కెట్ ధరైనా ఇప్పించాలని డిమాండ్ చేశారు. ‘ఏం కొట్లాడుతవో? ఏం చేస్తవో తెల్వదు.. మా దాతారుపల్లికి న్యాయం చేసి చూపించాలి. చూపించినంకనే మాట్లాడుతాం’ అని ఎమ్మెల్యేపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.