హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సీనియర్ ఐఏఎస్ అధికారి, ఎక్సైజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ (SAM Rizvi) వీఆర్ఎస్కు (VRS) కారణం ఏమిటి? ఇంకా ఎనిమిదేండ్ల సర్వీస్ ఉండగానే అకస్మాత్తుగా స్వచ్ఛంద పదవీ విరమణ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మద్యం లేబుళ్ల తయారీ కుంభకోణమే ఆయన వీఆర్ఎస్కు దారి తీసిందా? మూటల కోసం పెద్దల మధ్య జరిగిన కొట్లాటలో రిజ్వీ బలయ్యారా? అటు పెద్దలకు సర్దిచెప్పలేక, మంత్రిని సమన్వయం చేసుకోలేక ఉద్యోగాన్ని వదులుకున్నారా? లేదా కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉన్నదా? ఇప్పుడు ఐఏఎస్ వర్గాల్లో జరుగుతున్న తీవ్ర చర్చ ఇది. దీనిపై నమస్తే తెలంగాణ లోతుగా అధ్యయనం చేయగా సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైసెక్యూరిటీ హాలోగ్రామ్స్, 2డీ బార్ కోడింగ్ లేబుల్స్ తయారీ టెండర్లకు సంబంధించి ఇద్దరు అధికార పక్ష నేతల మధ్య జరిగిన.. జరుగుతున్న కొట్లాటకు రిజ్వీ బలయ్యాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజ్వీ వీఆర్ఎస్ను ఆమోదిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే రిజ్వీ వీఆర్ఎస్ను తిరస్కరించాలంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వయంగా సీఎస్‌కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. దీంతో రిజ్వీ రాజీనామాపై అనుమానాలు మరింత పెరిగాయి.
రాష్ట్రంలో అక్రమ మద్యం, నకిలీ మద్యం కట్టడి కోసం ప్రభుత్వం హైసెక్యూరిటీ హాలోగ్రామ్, 2డీ బార్కోడ్ అనే విధానాన్ని అమలు చేస్తున్నది. అయితే లేబుల్స్‌ను 11 ఏండ్లుగా ఒకే కంపెనీ సరఫరా చేస్తున్నది. 2013 ఆగస్టులో ఉమ్మడి రాష్ట్రంలో టెండర్లు పొందిన కంపెనీ కాంట్రాక్ట్‌నే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ మయాంలోనే కొత్త టెక్నాలజీతో ముందుకొచ్చే సంస్థలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 2022 నవంబర్‌లో టెండర్లు పిలిచింది. 15 కంపెనీలు బిడ్డింగ్‌లో పాల్గొన్నాయి. అయితే ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిడ్డింగ్ ప్రక్రియను నిలిపివేసింది. పాత కంపెనీకి మళ్లీ లేబుల్స్ సరఫరా కాంట్రాక్ట్ దక్కింది. ఒప్పందం కన్నా తక్కువ ధరకు, వేగంగా లేబుల్స్ సరఫరా చేయగలిగే అవకాశ ఉన్నప్పటికీ.. పాత కంపెనీకే ప్రభుత్వం మొగ్గు చూపడంపై నిరుడు అక్టోబర్‌లో ఆరోపణలు వెల్లువెత్తాయి.
దాదాపు రూ.100 కోట్ల టర్నోవర్ ఉన్న ఈ టెండర్‌పై బిగ్‌బ్రదర్స్ కన్ను పడిందని అప్పట్లో చర్చ జరిగింది. పాత కంపెనీతో ఒప్పందం చేసుకొని, సరఫరాను తిరిగి వాళ్లకే అప్పగించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ విషయం సబంధితశాఖ మంత్రికి కూడా తెలియదన్న చర్చ జరిగింది. టెండర్లలో తాను సూచించిన కంపెనీకి ఇవ్వకుండా సమీక్ష పేరుతో రిజ్వీ కాలయాపన చేస్తున్నారని మంత్రి ఆగ్రహంతో ఉన్నారట. దీంతోపాటు రాష్ట్రంలోకి కొత్తగా వచ్చే బ్రాండ్లకు ముఖ్యనేత అనుచరుల కనుసన్నల్లోనే అనుమతులు ఇస్తున్నారని, తన ప్రమేయం లేకుండా టీజీబీసీఎల్ (బేవరేజెస్ కార్పొరేషన్) సొంత నిర్ణయాలు తీసుకుంటున్నదని సంబంధితశాఖ మంత్రి ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన అలిగారని, తనకు ఎక్సైజ్ శాఖే వద్దనే పరిస్థితి వచ్చిందని ప్రచారం జరిగింది.
వాటాల్లో లొల్లి!!
మద్యం సీసాల మీద వచ్చే కమీషన్లపై మొదటినుంచీ ముఖ్యనేతకు, సంబంధిత శాఖ మంత్రికి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయని ఎక్సైజ్ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో విక్రయిస్తున్న చీప్‌లిక్కర్ నుంచి ప్రీమియం లిక్కర్ వరకు ప్రతి క్వార్టర్ మీద రూ.3 నుంచి 7 వరకు ప్రభుత్వ పెద్దలకు కమీషన్ అందుతున్నట్టు ఎక్సైజ్ శాఖలో ప్రచారం ఉన్నది. ఇందులో ముఖ్యనేత 90 శాతం ఒక్కడే తీసుకుంటున్నారని, మిగితా 10 శాతం మాత్రమే సంబంధిత శాఖ మంత్రికి వెళ్తున్నదని వారి సన్నిహితులు చెప్పుకుంటున్నారు. దీంతో ఆగ్రహించిన మంత్రి.. గత ఏడాది చివరి మాసంలో నేరుగా వాటాల విషయమై ముఖ్యనేతను నిలదీసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అప్పట్లో వెనక్కి తగ్గిన ముఖ్యనేత.. సదరు మంత్రిని బుజ్జగించారని సమాచారం. విదేశాలకు వెళ్లిరావాలని, వచ్చిన తర్వాత లెక్కలు చూసుకుందామని చెప్పినట్టు తెలిసింది.
ఆయన విదేశాలకు వెళ్లిన తర్వాత మంత్రికి ఈ సమాచారం మొత్తం ఎవరు ఇచ్చారని ముఖ్యనేత అప్పట్లో ఆరా తీశారన్న చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా ఉన్న శ్రీధర్‌ను అర్ధాంతరంగా బదిలీ చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో మంత్రి ఎక్సైజ్‌శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ముర్తజా రిజ్వీని అనుమానించి, టార్గెట్ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక ప్రైవేట్ డిస్టీలరీపై రూ.5 కోట్ల జరిమానా విధించగా మంత్రి వ్యతిరేకించారని, నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని సూచించారని సమాచారం. అయినా రిజ్వీ పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. దీంతోపాటు బ్రూవరీలు, డిస్టిలరీలకు పెండింగ్ బకాయిల చెల్లింపుల్లోనూ మంత్రి వర్సెస్ ముఖ్య కార్యదర్శి అనే స్థాయిలో వివాదం చెలరేగిందని చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత మంత్రి చేస్తున్న ప్రతిపాదనలన్నింటినీ రిజ్వీ తోసిపుచ్చారని చెప్తున్నారు.
వరుస బదిలీలతో సతమతం
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండేండ్లలోనే నాలుగు శాఖలకు బదిలీ చేయడంపైనా రిజ్వీ మానసికంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేనాటికి రిజ్వీ వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా ఉన్నారు. డిసెంబర్ 14న విద్యుత్తుశాఖ కార్యదర్శిగా జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత 2024 జూన్ 24న మరోసారి బదిలీ చేసి కమర్షియల్ ట్యాక్స్ సెక్రటరీగా నియమించింది. ఆ తర్వాత ఆయనకు ఎక్సైజ్‌శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను కట్టబెట్టింది. గత నెల 26న జరిగిన బదిలీల్లో ఆయనను సాధారణ పరిపాలనావిభాగం (జీఏడీ-పొలిటికల్) కార్యదర్శిగా నియమించింది. ఆ నియామకం జరిగి నెల రోజులు కూడా పూర్తికాకముందే మరోసారి ఆయనను బదిలీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. మరోవైపు ఎక్సైజ్ మంత్రి ఆయనమీద లేనిపోని ఆరోపణలు చేస్తూ సీఎఎస్కు లేఖలు రాస్తున్నారని, ఆ కాపీలను అనుకూల మీడియాకు లీక్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాలతో రిజ్వీ తీవ్ర మనస్తాపం చెందినట్టు తెలిసింది.
తాను మరో మూడేండ్లు మానసిక క్షోభను అనుభవించుకుంటూ ఈ ప్రభుత్వంలో పనిచేయలేనని తన సన్నిహితుల వద్ద వాపోయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనకు ఐటీ సెక్టార్ మీద గట్టి పట్టు ఉన్నదని, ఇప్పుడున్న జీతానికి ఆరు రెట్లు వేతనం ఇస్తామని ప్రైవేట్ కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నాయని తెలిపారని సమాచారం. ఇక్కడ ఉండి మానసిక్ష క్షోభను అనుభవించడం కన్నా, వెళ్లిపోవాలని నిర్ణయించుకొని వీఆర్ఎస్ దరఖాస్తు పెట్టినట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. అయినా.. మంత్రి జూపల్లి ఆగలేదని, తన అక్కసు వ్యక్తపరుస్తూ సీఎస్‌కు లేఖ రాశారని అంటున్నాయి. ఈ లేఖపై ఐఏఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వృత్తి పరంగా పేరున్న అధికారిని నిర్దాక్షిణ్యంగా పదవికి రాజీనామా చేసిన పరిస్థితులపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 26 ఏండ్ల సర్వీస్‌లో చిన్న మచ్చ కూడా లేని రిజ్వీ.. ఎక్సైజ్ శాఖలో వాటాలు పంచలేక వీఆర్ఎస్ తీసుకున్నారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ఎందుకు చేశారు?
ఓవైపు ముఖ్యనేత, మంత్రిపై ఆరోపణలు, మరోవైపు రిజ్వీపై మంత్రి చేసిన ఆరోపణలు, అయినా ప్రభుత్వం రిజ్వీని రిలీవ్ చేయడంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తన శాఖ పరిధిలోని ముఖ్య కార్యదర్శిని రిలీవ్ చేయవద్దని మంత్రి స్వయంగా సీఎస్‌కు లేఖ రాసినా ఎందుకు పట్టించుకోలేదన్నది మొదటి ప్రశ్న. మంత్రి అభ్యంతర పెడుతున్నా రిలీవ్ ఎందుకు చేశారన్నది మరో ప్రశ్న. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. రిజ్వీ వీఆర్ఎస్ను, దాని వెనుక ఉన్న కుంభకోణాన్ని ఇక్కడికే పరిమితం చేస్తారా? లేదా లోతుగా దర్యాప్తు చేసి అసలు వాస్తవాలను బయటికి తెస్తారా? అని ఐఏఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రిజ్వీ వీఆర్ఎస్ వెనుక దాగి ఉన్న ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉన్నది.
రిలీవ్ చేయొద్దంటూ మంత్రి లేఖ
వీఆర్ఎస్ కోసం రిజ్వీ చేసిన దరఖాస్తును తిరస్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎస్‌ను కోరారు. ఈ మేరకు ఆరు పేజీల లేఖ రాశారు. రిజ్వీపై ఆరోపణలతో కూడిన ఆ లేఖను మంత్రి కార్యాలయమే బయటికి లీకు ఇచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ లేఖ ప్రకారం.. హైసెక్యూరిటీ హాలోగ్రామ్, 2డీ బార్కోడ్ల సరఫరా కాంట్రాక్ట్ 2013 ఆగస్టు నుంచి ఒకే కంపెనీ చేపడుతున్నది. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీని అన్వేషించడంతోపాటు కంపెనీని మార్చేందుకు కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణయించారు. ఈ మేరకు 2024 ఆగస్టు 13న ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీ, సీపీఈ శ్రీధర్‌తో సమావేశమైనట్టు వెల్లడించారు.
ఈ సందర్భంగా టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ పాత కంపెనీని కొనసాగించడానికి వీల్లేదని, వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, నివేదిక తయారు చేయాలని స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. అయినా రిజ్వీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సెప్టెంబర్ 24న, అక్టోబర్ 17న మరోసారి ఆదేశాలు జారీ చేశారు. అయినా రిజ్వీ ఎటువంటి చర్య తీసుకోలేదు. చివరికి 2024 డిసెంబర్ 14న ముసాయిదా కాపీని సిద్ధం చేశారు. రెండు నెలల తర్వాత ప్రిన్సిపాల్ సెక్రటరీ రిజ్వీ గత ఫిబ్రవరి 11న దీనిపై మెమో జారీ చేశారు. ఆ తర్వాత మరో రెండు నెలలకు గత ఏప్రిల్ 10న నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఆ తర్వాత నిపుణుల కమిటీ ఈ ఏడాది ఆగస్టు 4న మాత్రమే మళ్లీ సమావేశం అయ్యిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఇలా ఆలస్యం చేయడం వల్ల ప్రభుత్వానికి నష్టం కలిగిందని తెలిపారు. దీంతోపాటు పలు ఆరోపణలు చేస్తూ మంత్రి సీఎస్‌కు లేఖ రాశారు. కాబట్టి వీఆర్ఎస్ను తిరస్కరించాలని కోరారు.
రెండువైపులా ఒత్తిడి తట్టుకోలేక..
రిజ్వీ ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే టెండర్లపై అటు బిగ్ బ్రదర్స్ నుంచి ఇటు మంత్రి వైపు నుంచి ఒత్తిడి పెరిగిందన్న చర్చ జరుగుతున్నది. గతంలో ఉన్న ఒప్పందాలు రద్దు చేయాలని, కొత్తగా టెండర్లు పిలవాలని మంత్రి ఒత్తిడి చేసినట్టు తెలిసింది. మరోవైపు పాత పద్ధతే కొనసాగాలని బిగ్‌బ్రదర్స్ ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలో బిగ్బ్రదర్స్కు అనుకూలంగా రిజ్వీ వ్యవహరించారని ప్రచారం జరుగుతున్నది. దీనికితోడు ఒక డిస్టిలరీ ఎక్సైజ్ నిబంధనలు పాటించకపోవడంతో అధికారులు రూ.5 కోట్ల జరిమానా వేసినట్టు సమాచారం. అయితే ఆ జరిమానాపై మంత్రి అభ్యంతరం తెలిపారని, వెనక్కి తీసుకోవాలని సూచించారని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ ప్రతిపాదనను రిజ్వీ తిరస్కరించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రిజ్వీపై మరింత ఒత్తిడి పెరిగినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు హైసెక్యూరిటీ లేబుల్స్ వ్యవహారాన్ని మరింత లోతుగా తవ్వాలని, అందరి పేర్లను బహిర్గతం చేయాలని మంత్రి జూపల్లి వర్గం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో తాను అనసవసర వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉన్నదని రిజ్వీ భావించారని, ఇతర శాఖల్లోకి బదిలీ చేయాలని కోరారని సమాచారం. అయినా పెద్దలు వినకపోవడంతో వీఆర్ఎస్ తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.