సుబేదారి, అక్టోబర్ 22: కాంగ్రెస్ నాయకులు, అనుచరగణం ఆగడాలకు అడ్డూ అదుపూలేకుండా పోతున్నది. మీడియాలో నిజాలు రాస్తే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది. ప్రజల పక్షాన గళం వినిపిస్తున్న నమస్తే తెలంగాణ పత్రిక ప్రచురిస్తున్న కథనాలను జీర్ణించుకోలేకపోతున్నది. కాంగ్రెస్‌కు అనుబంధ గూండాల గుంపుగా తయారైన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉసిగొలిపి భయభ్రాంతులకు గురిచేస్తున్నది. భౌతిక దాడులతో బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య పాలకులు సైతం సాహసించని ఆకృత్యాలకు నేడు రేవంత్‌రెడ్డి పాలనలో కాంగ్రెస్ తెగబడుతున్నది. బుధవారం హనుమకొండ జిల్లా మడికొండలోని నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పత్రిక ప్రతులను చించివేసి హంగామా సృష్టించారు.
పెద్దపెద్ద కర్రలు.. వాటికి యూత్‌కాంగ్రెస్ జెండాలను తగిలించుకుని నమస్తే తెలంగాణ కార్యాలయంపై దౌర్జన్యానికి దిగారు. ఆఫీస్‌లో సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలు పేట్రేగిపోయారు. అక్కడ పనిచేసే సిబ్బందిని దూషించారు. మహిళా సిబ్బందిపై కూడా నోరుపారేసుకున్నారు. నమస్తే తెలంగాణ అంతుచూస్తామని బెదిరించారు. తమ ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులపై వార్తలు రాస్తే అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఉదయం 10 గంటల నుంచి మడికొండ పత్రిక కార్యాలయం చుట్టుపక్కల పదుల సంఖ్యలో గుమిగూడిన యూత్‌కాంగ్రెస్ కార్యకర్తలు 11 గంటల వరకు 150 మంది బైక్‌లు, ఇతర వాహనాల్లో చేరిపోయారు. నమస్తే తెలంగాణ ఆఫీస్ లోపలికి వెళ్లేందుకు యత్నించారు.
అసలేం జరిగిందంటే!
కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు, కుటుంబ సభ్యులు, అనుచరులు వరంగల్, నగర శివారులో భూదందాలు, సెటిల్మెంట్లు, అరాచకాలు, భౌతికదాడులకు పాల్పడుతున్నారు. రెచ్చిపోతున్న కాంగ్రెస్ నాయకుల తీరుపై.. పోలీసులకు అందిన ఫిర్యాదులు, బాధితుల ఆవేదన ఆధారంగా ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. వాటిని జీర్ణించుకోలేని ఎమ్మెల్యేల అనుచరులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం పక్కా ప్లాన్ తో మడికొండలోని నమస్తే తెలంగాణ యూని ట్ కార్యాలయానికి చేరుకున్నారు. ‘మా నాయకులపై వార్తలు రాస్తారా? ఖబర్దార్’.. ‘ప్రింట్ మీడియా డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. కార్యాలయం ప్రధాన గేట్ నుంచి లోపలికి చొరబడేందుకు యత్నించా రు. వారించిన సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషించారు, దాడికి యత్నించారు. కాసేపు అక్కడ ఏం జరుగుతున్నదో తెలియని ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
అరుపులు.. కేకలతో ఆ ప్రాంతమంతా అట్టుడుకిపోయిం ది. పత్రికా ప్రతులను చించివేసి అక్కసు వెళ్లగక్కారు. నమస్తే తెలంగాణ కార్యాలయం ముందు యూత్ కాంగ్రెస్ దాడి విషయం తెలుసుకున్న మడికొండ సీఐ కిషన్ తన సిబ్బందితో హుటాహుటిన చేరుకున్నారు. ఆగ్రహావేశాలతో ఊగిపోతున్న కార్యకర్తలను అదుపు చేసేందుకు యత్నించా రు. ఒకదశలో వారు పోలీసులపై వాగ్వాదానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను నెట్టివేసే ప్రయత్నం చేశారు. వారిని కార్యాలయం లోపలికి వెళ్లకుండా నిరోధించారు. కార్యాలయం ముందు అడ్డంగా కూర్చున్నారు.
దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
మడికొండ యూనిట్ కార్యాలయంపై దాడికి దిగి, సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని నమస్తే తెలంగాణ ప్రతినిధు లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మడికొండ పోలీస్ స్టేషన్లో సీఐ కిషన్‌కు, సీపీ సన్‌ప్రీత్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. వరంగల్ బ్రాంచ్‌మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధులు పిన్నింటి గోపాల్, నూర శ్రీనివాస్, క్రైమ్ రిపోర్టర్ అర్షం రాజ్‌కుమార్, ప్రొడక్షన్, సర్క్యులేషన్ మేనేజర్లు వేణుగోపాల్, అడెల్లి సురేశ్, శ్రీనివాస్, ఖదీర్, ప్రశాంత్ పోలీసు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యం ఖూనీ
నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాం గ్రెస్ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది పత్రికా స్వేచ్ఛపై నేరుగా దాడి చేయడమే. వాస్తవాలను బయటపెడితే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది. ప్రజాపాలన అం టూనే ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేస్తున్నది. తెలంగాణకు ప్రతీక అయినా నమస్తే తెలంగాణ పత్రికను అణగదొక్కడానికి చేస్తున్న కాంగ్రెస్ విధానాలను వ్యతిరేకిస్తున్నాం.
-ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి
చట్టపరమైన చర్యలు తీసుకోవాలి
నమస్తే తెలంగాణ యూనిట్ కార్యాలయంపై కాంగ్రెస్ నా యకులు దాడి చేయ డం దురదృష్టకరం. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డే జర్నలిస్టులకు చదువు రాదని హేళన చేశారు. వారి చెంప మీద కొట్టాలనిపిస్తుందని మాట్లాడుకొచ్చారు. ఇది దేనికి సంకేతం? ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆయన చూపించిన దారే. దాడికి దిగిన వారిపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి.
-ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
దాడులు విష సంస్కృతి
అక్రమాలు, వైఫల్యాలను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ శ్రేణు లు నమస్తే తెలంగాణ పై దాడులకు పాల్పడ టం మంచిది కాదు. దాడులు చేయ డం విష సంస్కృతి. కాంగ్రెస్ శ్రేణులు దాడులు చేయడం మానుకుని, అభివృద్ధి, హామీల అమలుపై దృష్టిపెట్టాలి.
–మంతూరి శశికుమార్, హైకోర్టు న్యాయవాది, మునిపల్లి, సంగారెడ్డి
దాడి అమానుషం
నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ ఆఫీసుపై దాడికి యత్నించడం అమానుషం. ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాప్రతినిధి అయినా ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లర్‌గా ఉన్న పత్రికలపై బెదిరింపులకు దిగడం సమంజసం కాదు. సమాజంలో జరుగుతున్న పరిణామాలపై వార్తలు రాసే స్వేచ్ఛ పత్రికలకు ఉంది. నమస్తే తెలంగాణ కార్యాలయంపై దాడికి దిగిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలి.
– కుడుతాడి బాపూరావు, జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
ప్రజాస్వామ్యంపై దాడి
ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించే మీడియా దాడులు సరికాదు. అవినీతి, అక్రమాలను వెలికితీసే బాధ్యత మీడియాపై ఉంది. అలాంటి ప్రతికలపై దాడులు చేయడం అమానుషం. తమ అవినీతి, అక్రమాలను వెలికితీస్తున్నారనే ఆక్రోశంతో ఎమ్మెల్యే అనుచరులు వరంగల్‌లోని నమస్తే తెలంగాణ దినపత్రిక యూనిట్ కార్యాలయం మీద దాడికి యత్నించడం దారుణం.
-సౌడాల కమలాకర్, ఐజేయూ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు, మెట్పల్లి
భౌతికదాడులు తగదు
నమస్తే కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. స్థానిక సమస్యలు, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై కథనాలు రాస్తున్న పత్రికలపై దాడులు చేయడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యదేశంలో పత్రికా స్వేచ్ఛపై దాడి బాధాకరం. భిన్నాభిప్రాయాలు ఉంటే వారి వాదనను తెలియజేయాలి కానీ ఇలా భౌతికదాడులకు పాల్పడటం కరెక్ట్ కాదు.
– క్రాంతికిరణ్, అందోల్ మాజీ ఎమ్మెల్యే