భైంసా టౌన్ : నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై (National Highway) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు (Boy) మృతి చెందాడు. స్థానికులు, రూరల్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన మల్లయ్య తన భార్య పిల్లలతో కలిసి కొంతకాలంగా వానల్పాడ్లో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాడు. అతని కొడుకు అనిల్ కుంటాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. అనిల్ శనివారం అనారోగ్య కారణాలతో వానల్పాడ్ కు వచ్చాడు.
అదే రోజు మొదటిసారి బైక్ నేర్చుకునే (Driving) ప్రయత్నం చేశాడు. ఆదివారం తెల్లవారుజామున తండ్రి నీళ్లు పారించడానికి పొలానికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన అనిల్ బైక్ తీసుకొని జాతీయ రహదారిపై డ్రైవింగ్ మొదలు పెట్టాడు. ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదివారం ఉదయం 5:40 నిమిషాలకు సంఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తల్లి సత్యశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.