హైదరాబాద్, అక్టోబర్ 17: జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాల దిగ్గజం తోషిబా భారీ పెట్టుబడులు పెట్టబోతున్నట్టు ప్రకటించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జపాన్‌తోపాటు భారత్‌ల్లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని రెట్టింపు పెంచుకోవడానికి 55 బిలియన్ల యెన్(రూ.3,232 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్టు శుక్రవారం ప్రకటించింది. ఈ భారీ పెట్టుబడులను తోహిబా ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సొల్యుషన్స్ కార్పొరేషన్(తోషిబా) ప్రకటించింది. దేశవ్యాప్తంగా హైదరాబాద్‌లో మాత్రమే సంస్థకు ప్లాంట్ ఉన్నది.
ఈ నిధులతో పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీఅండ్‌డీ) పరికరాల బిజినెస్‌ను మరింత విస్తరించనున్నది. అంతర్జాతీయంగా విద్యుత్ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు కంపెనీ వర్గాలు ప్రకటించాయి. దీంతో 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి జపాన్‌తోపాటు భారత్‌లో ఉన్న ప్లాంట్ల సామర్థ్యం రెండింతలు పెంచుకోనున్నది. జూలై 2024 నుంచి 2026 మధ్యకాలంలో 20 బిలియన్ల యెన్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు గతంలో సంస్థ ప్రకటించగా..దీనికి అదనంగా మరో 35 బిలియన్ల యెన్లు కూడా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. రెన్యూవబుల్ ఎనర్జీ, నూతన డాటా సెంటర్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండటంతో భారత్‌లో విద్యుత్‌కు డిమాండ్ భారీగా పెరుగుతున్నదన్నారు.