సిటీబ్యూరో, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ ): మూసీ నది పునరుజ్జీవం పేరిట రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల పొట్ట కొడుతున్నదని అర్బన్ డెవలప్మెంట్ ఫోరం (యూడీఎఫ్) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. నది ప్రక్షాళన ముసుగులో రియల్ ఎస్టేట్, టూరిజం వ్యాపారాలకు ప్రభుత్వం తెరలేపుతున్నదని ఫోరం కన్వీనర్ శ్రీనివాస్ విమర్శించారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. బఫర్ జోన్ పేరుతో ఏండ్ల తరబడి నివసిస్తున్న పేదల ఇండ్లను తక్షణమే తొలగించాలనే నిర్ణయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
నది ప్రక్షాళన జరగాలని నగర ప్రజలంతా కోరుకుంటున్నారని, కానీ ప్రభుత్వం చేస్తున్న చర్యలు చూస్తుంటే ఇది ప్రక్షాళన కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తున్నదని మండిపడ్డారు. అనుమతులున్న ఇండ్ల ఆక్రమణలు ఎలా అవుతాయని, గతంలో ప్రభుత్వ అనుమతులతో, బ్యాంకు రుణాలతో నిర్మించుకున్న ఇండ్లు ఇప్పుడు అకస్మాతుగా ఆక్రమణలని ఎలా ప్రకటిస్తారని నిలదీశారు. 50 మీటర్ల బఫర్ జోన్ అని ఏ ప్రాతిపదికన నిర్ణయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన అనుమతులపై వివరణ ఇవ్వకుండా ఏకపక్షంగా కూల్చివేతలు చేపట్టడం ప్రజాస్వామ్య విరుద్ధమని శ్రీనివాస్ విమర్శించారు.
డీపీఆర్ రాకముందే కూల్చివేతలా?
మూసీ పునరుజ్జీవ పథకానికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఇంకా ప్రజల ముందుకు రాకముందే, అసెంబ్లీలో చర్చించకముందే నివాసాలను తొలగించడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని శ్రీనివాస్ పేరొన్నారు. ‘గతంలో ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో డీపీఆర్ సిద్ధమయ్యాకే ముందుకు వెళ్తామని చెప్పిన మాటను ఎందుకు నిలబెట్టుకోవడం లేదని ప్రశ్నించారు. గరిష్ఠ నది ప్రవాహ మట్టం వివరాలను ప్రజలకు ఎందుకు బహిర్గతం చేయడం లేదన్నారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరిట వేలమంది పేదలను నిరాశ్రయులను చేశారని, అదే మోడల్‌ను హైదరాబాద్‌లో అమలు చేయాలని చూడటం ప్రజా వ్యతిరేక చర్య అని అన్నారు. గాంధీసరోవర్, రివర్ఫ్రంట్ప్రాజెక్టుల పేరుతో కార్పొరేట్ శక్తులకు మేలు చేయడం కోసం పేదల బతుకులను బుగ్గిపాలు చేయొద్దని కోరింది. ‘మూసీ పునరుజ్జీవం అంటే నది ప్రక్షాళన,పర్యావరణ పరిరక్షణే కావాలి తప్ప.. పేదలను నిరాశ్రయులను చేయడం కాదు.
డీపీఆర్ బహిర్గతం చేయాలి..
పూర్తిస్థాయి డీపీఆర్, ఎంఎఫ్ఎల్ వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి. మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో సమగ్ర చర్చలు నిర్వహించాలి. నది ప్రవాహానికి ఆటంకం లేని ఇండ్లను ముట్టుకోకూడదు. మురుగునీరు మూసీలో కలవకుండా శాశ్వత పరిషార మార్గాలు చూపాలి. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తే బాధితుల పక్షాన పోరాటం ఉధృతం చేస్తాం’ అని అర్బన్ డెవలప్ మెంట్ ఫోరం హెచ్చరించింది.