ఊబకాయం.. అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అధిక బరువుతో బాధపడేవారు ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధులకు గురై మరణించే అవకాశం 70 శాతం అధికంగా ఉంటుందట. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని బయటపెట్టింది. యూకే, ఫిన్లాండ్ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం నిర్వహించారు. యూకే బయోబ్యాంక్, ఫిన్నిష్ ట్విన్ కోహోర్ట్ నుంచి 5,40,000 మందికి చెందిన హెల్త్ డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా అధిక బరువుతో ఉన్నవారు ఆసుపత్రిలో చేరడానికి, అంటు వ్యాధులతో మరణించడానికి 70 శాతం అధిక అవకాశం ఉన్నట్లు గుర్తించారు. ఇక అత్యంత తీవ్రమైన ఊబకాయం ఉన్నవారు.. మూడురెట్లు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
(6 లక్షల) మంది.. ఊబకాయ బాధితులేనట! బరువును నియంత్రణలో ఉంచుకోలేని వ్యక్తులు తీవ్ర అనారోగ్యానికి గురికావడం, విస్తృతశ్రేణి అంటు వ్యాధుల వల్ల చనిపోయే అవకాశం గణనీయంగా ఉన్నదని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇక ఊబకాయ బాధితులకు టైప్-2 డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులు రావడానికి కూడా ఆస్కారం ఎక్కువే! ఇవే కాకుండా, వివిధ రకాల క్యాన్సర్లు సోకడానికీ స్థూలకాయమే కారణమని పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఊబకాయం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గడమే కాకుండా, ఊపిరితిత్తుల సామర్థ్యంపైనా ప్రతికూల ప్రభావం పడుతుంది.
దీనివల్ల ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పరిస్థితి త్వరగా విషమించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఊబకాయం వల్ల శరీరంలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అధికంగా ఉంటుంది. ఇది వైరస్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. అధిక బరువు వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి పెరిగి, గాలి పీల్చుకోవడం కూడా కష్టమవుతుంది. ఇది న్యుమోనియా వంటి స్థితిలో మరింత ప్రమాదకరంగా పరిణమిస్తుంది.
కాబట్టి, ఊబకాయ బాధితులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఫ్లూ టీకాలను సకాలంలో తీసుకోవడం వల్ల ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనీ, బరువు తగ్గడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అంటున్నారు. మొత్తంగా శరీరంతోపాటు ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.