పాలకుర్తి, సెప్టెంబర్ 9: భూస్వాములు, పెత్తందార్లకు ఆమె సింహస్వప్నం. దున్నేవాడికే భూమి కావాలని, వెట్టిచాకిరి నుంచి పేదలకు విముక్తి క ల్పించాలని నినదించిన వీరనారి చాకలి ఐలమ్మ. నాటి నిజాం నిరంకుశ పాలనపై తిరుగుబాటు చేసి ప్రజలను ఉద్యమంలోకి తీసుకొచ్చిన ఐలమ్మ సా యుధ రైతాంగ పోరాటంలో వీరోచితంగా పోరాడింది.
ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురంలో నిరుపేద చాకలి కుటుంబంలో జన్మించిన ఐలమ్మకు పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో వివాహమైంది. నాడు కులవృత్తితో పిల్లలను పోషించలేని స్థితిలో మల్లంపల్లికి చెందిన కొండల్రావు తల్లి జయప్రదాదేవి వద్ద బీడు భూమిని కౌలు కు తీసుకొని వ్యవసాయం చేసింది. ఈ నేపథ్యంలో పాలకుర్తికి చెందిన పట్వారీ శేషగిరిరావుతో పాటు భూస్వాముల కన్ను ఐలమ్మ పంటపై పడింది.
పం టను అక్రమంగా కోసే ప్రయత్నం చేయగా కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసంఘాల అండతో తిప్పికొట్టింది. 60 గ్రామాలకు కేంద్రంగా విస్నూరులోని భూస్వామి రాపాక రామచంద్రారెడ్డి నియంతృత్వానికి, గూండాయిజానికి వ్యతిరేకంగా నాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అగ్నికణంలా పోరాడింది. ఆమె పోరాట ఫలితంగా జనగామ డివిజన్లో వేలాది ఎకరాలు పేదలకు దక్కాయి. 1985 సెప్టెంబర్ 10న వీరనారి కన్నుమూసింది. ఐలమ్మను భావితరాలకు గుర్తు చేసేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె జయంతి, వర్ధంతిని అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఐలమ్మ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు.