సిటీబ్యూరో, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సారథి పోర్టల్‌తో సతమతమవుతున్న వాహనదారులకు అదనంగా డబ్బులు ఖర్చు చేసుకుంటేగానీ పనులు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్లాట్ బుక్ చేసుకుంటే సాంకేతిక సమస్యలు చూపిస్తున్నాయని.. ఆర్టీఓ కార్యాలయాలను సంప్రదిస్తే తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారని చెబుతున్నారు. అదే ఏజెంట్లను ఆశ్రయిస్తే మాత్రం పనులు తొందరగా అవుతున్నాయని అన్నారు. స్లాట్ బుక్ కావాలంటే రూ.500 వరకు చార్జీ చేస్తున్నారని రవి అనే వాహనదారుడు వివరించారు.
ఆ స్లాట్ బుకింగ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వారు నేరుగా ఆర్టీఏ అధికారులను సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారని వివరించారు. ఇదే సమస్యపై తాను గతంలో వెళితే అది కేంద్ర రవాణా శాఖకు మెయిల్ చేయాల్సి ఉంటుందని చెప్పారని పేర్కొన్నారు. అయితే సారథి పోర్టల్‌లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి ఆర్టీఏ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు. ఏజెంట్లకు కొంతమంది ఎంవీఐలు అండగా నిలుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సారథి సాంకేతిక సమస్యలను క్యాష్‌గా మలుచుకుంటున్నారు.
ఇప్పటికే ఆర్టీఏ కార్యాలయాల్లో ఏ పని కావాలన్నా ఏజెంట్లు చక్కబెడుతున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారుల ఎంక్వైరీ చేసిన ఆ రెండు రోజుల్లో ఏజెంట్లను కార్యాలయాల్లోకి రాకుండా ఆదేశాలు ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ యథా మామూలే అన్న చందంగా తయారైంది. ఇక వాహన్ సేవలు కూడా మరో రెండు వారాల్లో అందుబాటులోకి రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. వాహన సేవలన్నీ ఇక కేంద్ర రవాణా శాఖ పోర్టల్స్ సారథి, వాహన్ల ద్వారానే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ పోర్టల్ సేవలు చాలా వరకు సాంకేతిక సమస్యలతోనే నిండి ఉంటున్నాయి. సారథి పోర్టల్ సమస్యలు పరిష్కరించకుండానే మరో పోర్టల్ వాహన్ సేవలను తీసుకొస్తే వాహనదారులకు తిప్పలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.