కాఠ్మాండు, సెప్టెంబర్ 9: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిపై జనరేషన్ జెడ్ పేరిట నేపాలీ యువజనులు గడచిన రెండు రోజులుగా ఉధృతంగా సాగిస్తున్న నిరసనలు ప్రధాని కేపీ ఓలీ, హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామాలకు దారితీసిన నేపథ్యంలో తదుపరి నేపాల్ ప్రధాని ఎవరన్న దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ సందర్భంగా కొన్ని పేర్లు ప్రముఖంగా బయట ప్రచారంలో ఉన్నాయి.
రాజకీయనేతలందరూ దొంగలే అంటూ పాటలు పాడే ర్యాపర్ తానే రాజకీయ నేతగా మారడం విచిత్రం కాగా కాఠ్మాండు మెట్రోపాలిటన్ నగర మేయర్‌గా ఉన్న బలేన్ షా యువజనుల జనరేషన్ జెడ్ ఉద్యమంతో తదుపరి ప్రధానిగా ఎంపికయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. దేశాన్ని రక్షించే వారంతా అవివేకులు. నాయకులందరూ దొంగలే. దేశాన్ని లూటీ చేస్తూ, అందినకాడికి తినేస్తున్నారు అంటూ ఓ పాటలో రాజకీయ నాయకులను తీవ్ర పదజాలంతో విమర్శించిన బలేన్ షా నగర మేయర్‌గా నిరసనకారులకు మంగళవారం తన ఫేస్బుక్ ద్వారా ఓ శాంతి సందేశం అందచేశారు.
ప్రధాని పదవి నుంచి తప్పుకున్నందున నిరసనకారులు ఇకపై ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆయన పిలుపునిచ్చారు. అందరం సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని, ఈ దేశాన్ని ముందుకు నడపాల్సింది మీ తరమేనని ఆయన కోరారు. 33 ఏళ్ల షా 2022లో జరిగిన మేయర్ ఎన్నికల ప్రచారంలో నల్ల బ్లేజర్, జీన్స్, చదరపు ఫ్రేము చలువ కళ్లద్దాలు, భుజాలపై నేపాలీ జెండా ధరించి నేపాలీ యువతకు ప్రతినిధిగా నిలిచి గెలిచారు. సాంప్రదాయ రాజకీయ నేతలతో విసిగిపోయిన నేపాలీ ప్రజలకు బలేన్ షా ఆశాకిరణంలా కనపడ్డారు. తాజా ఉద్యమంతో షా పేరు ప్రధాని రేసులో ప్రముఖంగా వినపడుతోంది.
ప్రస్తుత ఉద్యమానికి సారథ్యం వహించిన హక్కుల కార్యకర్త హమీ నేపాల్ అనే ఎన్జీఓకి అధ్యక్షుడిగా ఉన్న 36 ఏళ్ల సుదన్ గురుంగ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. సోషల్ మీడియా నిషేధంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలో, అందుకు అనుసరించవలసిన వ్యూహాన్ని గురుంగ్ ఎన్జీఓ మార్గదర్శనం చేసింది. విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థ ఉద్యమానికి వ్యూహ రచన చేసింది.
విపత్తుల సమయంలో బాధితులకు అండగా నిలబడేందుకు గడచిన దశాబ్దకాలంగా ఒక కార్యకర్తగా, దాతగా పనిచేస్తున్నట్లు గురుంగ్ తన గురించి తాను చెప్పుకున్నారు. ఓ భూకంపంలో బిడ్డను కోల్పోయిన తర్వాత గురుంగ్ జీవితమే మారిపోయిందని, విపత్తు సమయంలో బాధితులకు అండగా ఉండేందుకు ఆయన ఎన్జీఓని స్థాపించి సేవలందరచేస్తున్నారని నేపాలీ మీడియా తెలిపింది. ప్రజల కోసం ప్రజల చేత నడిచే పాలన ఉండాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు ఆయన గతంలో తెలిపారు.
నేపాలీ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను పునరుద్ధరించినప్పటికీ ఉవ్వెత్తున లేచిన నిరసనలు ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామాకు దారితీశాయి. 2024 జూలైలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 73 ఏళ్ల ఓలీ తన 22వ ఏట చదువు మధ్యలోనే వదిలేసి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన నాయకత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ 2018లో యూనిఫైడ్ మార్క్సిస్టు లెనినిస్టు(యూఎంఎల్)తో కలసి ఎన్నికల్లో పోటీచేసి మూడింట రెండువంతుల మెజారిటీని సంపాదించుకుంది.
అనంతరం రెండుపార్టీలు విలీనమై ఓలీ, ప్రచండ నాయకత్వాన్ని పంచుకున్నారు. 2015-2016లో మొదటిసారి నేపాల్ ప్రధానిగా పనిచేసిన ఓలీ తిరిగి రెండవసారి 2018-21లో ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 2022 ఎన్నికలలో ఓలీకి చెందిన సీపీఎన్-యూఎంఎల్ రెండవ స్థానానికి పడిపోగా నేపాలీ కాంగ్రెస్ మొదటిస్థానంలో నిలిచింది. ప్రచండకు చెందిన మావోయిస్టు సెంటర్ మూడవ స్థానంలో ఉంది. అయితే అనూహ్యంగా ప్రచండ, ఓలీ చేతులు కలపడంతో ప్రచండ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం గత ఏడాది ఓలీ మూడవసారి బాధ్యతలు చేపట్టారు.