‘మార్కెట్ లెక్కలు వేసుకోకుండా ఒక అద్భుతమైన సినిమా ఇవ్వాలనే సంకల్పంతో చేసిన సినిమా ‘మిరాయ్’. ఇందులో దాదాపు ఒక పది లార్జర్ ఎపిసోడ్లుంటాయి. మంచి కథ, చక్కని సంగీతం, గ్రేట్ లొకేషన్స్, అద్భుతమైన గ్రాఫిక్స్.. ఓవరాల్‌గా నెక్ట్స్ లెవల్ సినిమా ‘మిరాయ్’ ’ అంటూ నమ్మకం వెలిబుచ్చారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. తేజ సజ్జా సూపర్ యోధగా, మంచు మనోజ్ విలన్‌గా ఆయన నిర్మించిన పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు టీజీ విశ్వప్రసాద్. ‘చందమామ కథల్నీ, అమరచిత్ర కథల్నీ చిన్నప్పట్నుంచీ ఇష్టపడేవాడ్ని. ఆ కథలన్నీ మన రామాయణ, మహాభారత ఇతిహాసాలకి కనెక్ట్‌గా ఉంటాయి.
‘మిరాయ్’ కూడా ఇంచుమించూ అలాంటి కథే. ఇదొక ఫాంటసీ అడ్వెంచర్. చరిత్రతోపాటు ఫిక్షన్ కూడా మిళితమైన కథ ఇది. అశోకుడు తన జ్ఞానాన్ని 9 పుస్తకాల్లో నిక్షిప్తం చేసి, వాటి రక్షణార్థం ఎనిమిది పుస్తకాలను ఎనిమిదిమంది యోధులకు అందజేస్తాడు. ఒక పుస్తకాన్ని మాత్రం ఓ ఆశ్రమానికి అందిస్తాడు. ఆ పుస్తకాల ప్రాధాన్యతేంటి? వాటికోసం హీరో, విలన్ ఎలాంటి పోరాటం చేశారు అనేదే సినిమా. ఒక తల్లి సంకల్పంతో ముడిపడిన కథ ఇది. ఆ సంకల్పం ఏంటనేది తెరపై చూస్తేనే బావుంటుంది.’ అని చెప్పారు విశ్వప్రసాద్. కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఉన్న దర్శకుడని, ఒక బ్రిలియంట్ డీవోపీగా తనకి లొకేషన్లు, సెట్స్, గ్రాఫిక్స్‌పై పూర్తి అవగాహన ఉందని, ఈ ప్రాజెక్ట్ ఇంతబాగా రావడానికి కారణం అదేనని విశ్వప్రసాద్ పేర్కొన్నారు.
కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నార్త్‌లో రిలీజ్ చేయడం ఆనందంగా ఉందని, అలాగే యూఎస్‌లో శ్లోక సంస్థతో కలిసి విడుదల చేస్తున్నామని, కర్ణాటకలో హోంబలే, కేరళలో గోకులం, తమిళనాడులో ఏజీఎస్ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాయని, ఈ సినిమాను ఎక్కువమంది చూడాలని టికెట్ రేట్లను కూడా పెంచడంలేదని, జనరల్‌గా ఉండే టికెట్ ధరనే పెట్టామని విశ్వప్రసాద్ తెలియజేశారు. ‘2018 నుంచి నా సినిమాలు విడుదల అవుతున్నాయి. ప్రతి ఏడాదీ మాకు సక్సెస్‌లున్నాయి. కానీ 2024 మాత్రం డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు ‘మిరాయ్’తో కంబ్యాక్ ఖాయం.’ అంటూ నమ్మకంగా చెప్పారు టీజీ విశ్వప్రసాద్.
‘ది రాజాసాబ్’ సినిమా గురించి చెబుతూ ‘జనవరి 9న ‘రాజాసాబ్’ని విడుదల చేస్తున్నాం. ‘కాంతార 2’తో ‘రాజాసాబ్’ ట్రైలర్‌ని రిలీజ్ చేస్తాం. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా ఫస్ట్ సింగిల్ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నాం.’ అని తెలిపారు. తన రానున్న సినిమాల గురించి చెబుతూ ‘వచ్చే నెలలో ‘తెలుసు కదా’ వస్తుంది. ఆ తర్వాత ‘మోగ్లీ’ ఉంటుంది. అలాగే లావణ్య త్రిపాఠి కథానాయికగా ఒక థ్రిల్లర్ చేస్తున్నాం. సునీల్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాం. వాటిని కూడా ఈ ఏడాదిలోనే విడుదల చేస్తాం. గూఢచారి 2, గరివిడి లక్ష్మి, అలాగే కన్నడంలో కొన్ని సినిమాలు చేస్తున్నాం. దాదాపు మా సంస్థ నుంచి 2026-2027 మధ్య 12 సినిమాలు రానున్నాయి.’ అని తెలిపారు విశ్వప్రసాద్.