హనుమకొండ చౌరస్తా, మార్చి 17 : కాకతీయ యూనివర్సిటీ: కాజీపేట (అయోధ్య పురం)లో నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకే ఉద్యోగాలు ఇవ్వాలని కేయూ జేఏసీ అధ్యక్షుడు దొగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు. కోచ్ ఫ్యాక్టరీలో స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కేయూ లైబ్రరీ వద్ద జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా పోరాటాలు నిర్వహించారని, కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం భూసేకరణ చేస్తున్నప్పుడు రాష్ర్ట ప్రభుత్వం భూములు కోల్పోయిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి భూసేకరణ చేసిందన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం కలెక్టర్ ద్వారా భూములు కోల్పోయిన 114 మంది అయోధ్యపురం గ్రామ రైతుల పేర్లు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసిన, రెండుసార్లు కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన సంబంధిత కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేసిన ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించకుండా వారికి ఇచ్చిన హామీని తుంగలోతొక్కి ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంతో ఈ ప్రాంతంలోని అనేకమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని తమ జీవనోపాధి అయినా భూమిని కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం రైతులు అప్పగించారని, వారిని అర్థం చేసుకోకుండా రైతులను మోసం చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు.
ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇప్పించేవిధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన కాజీపేట రైల్వేను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీఎస్ఏ రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్‌గౌడ్, పీడీఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, నాయకులు రాజు, శ్రీకాంత్, అనిల్, రాజేష్ పాల్గొన్నారు.