Vemulawada | కరీంనగర్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వేములవాడ రాజన్న అలయం విస్తరణ పనుల విషయంలో ప్రభుత్వం దాడుగుమూతలు ఆడుతున్నది. రాజకీయం చేస్తున్నది. రాజన్న అయానికి ఉన్న ప్రాశస్థ్యం, ప్రాముఖ్యం, భక్తుల నమ్మకాలకు విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దర్శనాలకు సంబంధించి అధికారులు పూటకోమాట చెప్తుండటంతో భక్తులు గందరగోళానికి గురవుతున్నారు. నిజానికి, రాజన్న అలయ విస్తరణకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నది. ఆలయాన్ని అత్యంత వైభవంగా నిర్మించాలని సంకల్పించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. 33 ఎకరాల స్థలాన్ని సేకరించడంతోపాటు సుమారు రూ.120 కోట్లతో గుడి చెరువును సుందరీకరించారు. ఆలయానికి అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు వందల కోట్లు వెచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వేములవాడ రాజన్న ఆలయానికి రూ.76 కోట్లు కేటాయించినట్టు పేర్కొంటూ శిలాఫలకాన్ని ఆవిషరించారు. మొత్తం రూ.150 కోట్లతో మొదటి దశ పనులు చేపట్టినట్టు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. ఆలయ అభివృద్ధిని అన్నీ పార్టీలు, భక్తులు స్వాగతిస్తున్నారు. కానీ, విస్తరణ పనులు ఎలా చేస్తారో స్పష్టత ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు.
గతంలో ఒకసారి నామమాత్రంగా పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసిన అధికారులు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.680 కోట్లతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ అభివృద్ధి, విస్తరణ పనులను ఎప్పటిలోగా పూర్తిచేస్తారు? ఎన్నింటికి టెండర్లు పూర్తిచేశారు? భక్తుల విశ్వాసాలకు, నమ్మకాలకు లోబడి విస్తరణ పనులు చేపడుతున్నారా? అనేదానిపై స్పష్టతలేదు. శ్రీ రాజరాజేశ్వరస్వామి సాక్షాత్తూ చెరువు కట్టపై కొలువుదీరి ఉన్నారు. విస్తరణ నిర్మాణ పనులను పిల్లర్లు వేసి నిర్మిస్తామని ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. వీటిని సిమెంట్‌తో నిర్మిస్తారా? లేక రాతి కట్టడాలు చేస్తారా? అనే సందేహాలున్నాయి.
విస్తరణ పనుల నేపథ్యంలో ఆలయ మూసివేత, దర్శనాల నిలిపివేత విషయంలో పూటకో ప్రకటన వెలువడుతున్నది. దీంతో భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. రాజన్న ఆలయంలో నిత్యం నిర్వహించే కోడెమొక్కులు, అభిషేకాలు, అన్నపూజ, కుంకుమపూజ, నిత్యకల్యాణం, చండీహోమం తదితర పూజా కార్య్రమాలను ఈ నెల 11 నుంచి భీమేశ్వరస్వామి ఆలయం వద్ద నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు అదేరోజు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 12 (ఆదివారం) నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలను నిలిపివేస్తున్నట్టు దేవాలయ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా, ఈ నెల 11న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వయంగా కోడె మొక్కలు చెల్లించి, పూజలను అధికారికంగా ప్రారంభించినట్టు తెలిపారు. దీనిపై విమర్శలు రావడంతో మరో ప్రకటన జారీచేశారు.
ప్రధాన ఆలయంలో నిత్య కైంకర్యాలు, చత్షుకాల పూజలు, ఆలయ అర్చకులు యధావిధిగా, ఆంతరంగికంగా నిర్వహిస్తారని ప్రకటించారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి రాజన్న ముందు కోడె మొక్కులు, ఇతర పూజ కార్యక్రమాలు తీర్చుకుంటారు. వీటిని భీమేశ్వర ఆలయంలో ఎలా చేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఒకచోట, మొక్కులు మరోచోట ఎలా తీర్చుకుంటామని భక్తులు వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో అధికారులున్నారు. ఏటా కోటిన్నర మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. జనవరి 28 నుంచి 31 వరకు తెలంగాణ కుంభమేళా సమ్మక-సారలమ్మ జాతర ఉన్నది.
ఈ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలోనే దాదాపు కోటి మంది భక్తులతో ఆలయం కిక్కిరిసిపోతుంది. వచ్చేది కార్తీకమాసం. దీనికితోడు సమ్మక భక్తుల తాకిడి ప్రారంభం కానున్నది. ఇటువంటి పరిస్థితుల్లో భీమేశ్వర ఆలయంలో పూజలు చేస్తే రాజన్న దర్శనం ఎలా కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు. రాజన్న ఆలయంలో 12 నుంచి దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించినా ఆదివారం మళ్లీ కల్పించారు. ఆదివారం నుంచి రాజన్న ఆలయంలో దర్శనాలు బంద్ చేస్తున్నట్టు ప్రకటించడంతో వేములవాడ పట్టణంలోని దాదాపు నాలుగైదు వేల మంది భక్తులు తరలివచ్చి శనివారం రాత్రి వరకు స్వామివారిని దర్శించుకున్న తీరు ప్రభుత్వ హడావుడి నిర్ణయాలకు, పొంతన లేని ప్రకటనలకు, పటిష్ట ప్రణాళిక లేని విస్తరణ పనులకు అద్దంపడుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చే భక్తుల మీద ఆధారపడి దాదాపు 5,000కు పైగా కుటుంబాల చిరు వ్యాపారులు జీవిస్తున్నారు. గుడి బంద్ అవుతుందన్న ప్రకటనల నేపథ్యంలో వ్యాపారాలు ఎలా చేస్తారంటూ గతంలో మాదిరిగా పెద్ద వర్తకులు తమకు అప్పు ఇవ్వడం లేదని హోల్‌సేల్ వ్యాపారులు, చిరువ్యాపారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆలయ రోడ్ల అభివృద్ధి పేరుతో కొద్ది నెలల క్రితం కూల్చివేసిన ఇండ్లు, దుకాణాల స్థానంలో తట్టెడు మట్టి ఎత్తకపోగా, ఇంకా కూల్చివేతలు కొనసాగించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తుందన్న విమర్శలొస్తున్నాయి.
ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం ప్రారంభమైనా ఉత్తర తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి ముందుగా రాజన్న ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ వందల ఏండ్లుగా ఉన్నది. కోడెమొకుతోపాటు స్వామివారి నిత్యసేవలైన అభిషేకం, అన్నపూజ, కల్యాణం, తలనీలాల లాంటి మొకులను సమర్పించుకునే సంప్రదాయం తరతరాలుగా వస్తున్నది. ఈ మొకులన్నీ రాజన్నకే చెందుతాయి. కానీ, ఇప్పడు భీమేశ్వరాలయంలో మొక్కులు చెల్లించుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఈ మొక్కులు రాజన్నకు ఎలా వర్తిస్తాయన్నది భక్తుల నుంచి వస్తున్న ప్రశ్న. ప్రభుత్వం మాత్రం భీమేశ్వరాలయంలోనే పూజలు చేసుకోవాలని చెప్తుండటంతో భక్తులు అయోమానికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో విస్తరణ పనులపై స్పష్టత ఇవ్వడంతోపాటు ఎప్పటిలోపు పూర్తిచేస్తారో చెప్పాలన్న డిమాండ్ వస్తున్నది. ఇప్పటికే గుడి దర్శనాల మూసివేతపై భక్తుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మున్ముందు ఎలా స్పందిస్తుందో చూడాలి.
రాజన్న ఆలయ ఉద్యోగులు సైతం ఆలయ విస్తరణ పనుల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు, భక్తుల దర్శనాల నిలివేతపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. స్వామివారికి సాలీనా రూ.100 కోట్ల మేర నగదు ఆదాయం సమకూరుతున్నది. ఆలయాన్ని మూసివేస్తున్నారన్న ప్రకటనలతో భక్తుల సంఖ్య పడిపోయినట్టు తెలుస్తున్నది. రాజన్న ఆలయంలో విధులు నిర్వర్తించే ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిపి ప్రతినెలా దాదాపు రూ.మూడున్నర కోట్ల మేర వేతనాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతోనే ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే విధానం అమలవుతున్నది.
యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. కానీ, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అలాంటి ఏర్పాట్లు చేయలేదు. భీమేశ్వరాలయం లో చేపడుతున్న ఏర్పాట్లకు కూడా వేములవాడ రాజన్న ఆలయ ఖజానా నుంచి మూడున్నర కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నది. స్వామివారి భక్తుల సంఖ్య తగ్గిపోతే తమ జీతాలు ఎలా చెల్లిస్తారనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది.